బెంగాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణించాయని గవర్నర్ .. కేంద్రానికి నివేదిక పంపేశారు. అలాంటి నివేదిక వస్తే.. వెంటనే… రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రానికి అధికారం దఖలు పడినట్లే. దీనికి కారణం భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెంగాల్ పర్యటనకు వెళ్లిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై 24 పరగణ జిల్లాలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై దాడి ఘటనలోరాళ్లేసింది టీఎంసీ శ్రేణులేనంటూ బీజేపీ ఆరోపించింది.. ఈ ఘటనను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది.. బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోం శాఖ నివేదిక అడిగింది. దీనితో బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కేంద్రానికి నివేదిక పంపారు.. నిప్పుతో చెలగాటం ఆడవద్దంటూ మమతానుద్దేశించి హెచ్చరించారు. సీఎస్, డీజీపీ రావాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. తాము రాబోమని వారు కేంద్రానికి రివర్స్ రిప్లయ్ పంపారు. గవర్నర్ బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నారని మమతా బెనర్జీ ఫైర్అవుతున్నారు.
నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిని డ్రామాగా మమతా బెనర్జీ చెబుతున్నారు. బీజేపీకి వేరే పనేం లేదు… ఒక్కోసారి హోం మంత్రి బెంగాల్ వస్తారు..మిగిలిన సార్లు చడ్డా…నడ్డా….బడ్డా బెంగాల్‌కు వస్తారు… వాళ్ళ ర్యాలీలకు ప్రజలు రాకపోతే బీజేపీ ఇలాంటి డ్రామాలకు తెరతీస్తుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మమత వ్యాఖ్యలపైనా గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ హుందాగా వ్యవహరించాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ధన్కర్ సూచించారు. అక్కడ బీజేపీ తరపున గవర్నర్ రాజకీయం చేయడానికి సిద్ధం కావడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఎన్నికలు జరిగే వరకూ ఈ పరిస్థితి ఇంతే కొనసాగే అవకాశం ఉంది.