మూడు రాజధానులు ఎజెండాగా ఎన్నికలకు వెళ్లడానికి జగన్ న్యాయవ్యవస్థను కూడా తప్పు పడుతున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడు రాజధానుల విషయంపై ముందు చూపించిన దూకుడు లేదు. ఏం చేయాలన్నా నిధులు లేవు. అందుకే దీనిని ఎన్నికల అంశం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా అర్థం అవుతోంది. వాస్తవానికి కోర్టు తీర్పు అనేది వైసీపీ ప్రభుత్వానికి వ్యతికమే కానీ దాన్నే రాజకీయంగా మార్చుకుంటున్నారు సీఎం జగన్. మూడు రాజధానులను ఇలా లైవ్లో పెట్టి … మూడు రాజధానులు కావాలా వద్దా అని ప్రజల్ని ఓట్లడిగేందుకు… ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చేయాల్సినవన్నీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే అధికార పార్టీకి మూడు రాజధానుల ఎజెండానే సెట్ చేయాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే … ఐదేళ్ల పరిపాలన ప్రజల మనసుల్లో ఉంటుంది. వారేం చేశాలో కళ్ల ముందు ఉంటుంది. ఓటు వేసే సామాన్యుడు… తమకు ప్రభుత్వం మేలు చేసిందా.. కడుపు కొట్టిందా అని చూస్తారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ఎన్ని రకాలుగా చెడ్డ పేరు తెచ్చుకుందో చూస్తూనే ఉన్నాం. దాదాపుగా ప్రతీ వర్గాన్ని ప్రభుత్వం నానా తిప్పలు పెడుతోంది. రోజువారీ కూలీలను వదిలి పెట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి రాజధానులు ఎజెండా అవుతుందా ?
ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఈ విషయం కోర్టుల్లో ఉన్న వందల కొద్ది పిటిషన్లే చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఎలా కడుతుంది అనేది కనీసం రెండు, మూడు శాతం జనాభా అయినా ఆలోచిస్తే పరిస్థితి మారిపోతుంది. మేం చేయాలనుకున్నాం. . చేయలేకపోయాం.. ఇప్పుడు చేస్తాం.. అన్న వాదనని ప్రజలు విశ్వసిస్తారా.. అనేది ఇక్కడ కీలకం.
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే జగన్ మూడురాజధానుల ఎజెండాతో వెళ్లి గెలిచినా మూడు రాజధానులు ఏర్పాటు చేయలేరు. ఎందుకంటే చట్టం అంగీకరించదు. దాన్ని అధిగమించలేరు. మరి ఎలా చేస్తారు .. ఎప్పట్లాగే ప్రజల్ని మోసం చేయడం తప్ప ఏమీ చేయలేరు.