ధాన్యం కొనుగోళ్ళలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన మహేశ్వర్ రెడ్డి సోమవారం ఆధారాలు బయటపెడుతానని స్పష్టం చేయడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. యూ ట్యాక్స్ అంటూ మహేశ్వర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ నడుస్తుండగానే తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఇది 1100కోట్ల స్కామ్ అని ఆరోపించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి సోమవారం ఎలాంటి ఆధారాలు బయటపెడుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
పౌరసరఫరాల శాఖలో అవకతవకలు జరిగాయని, వందల కోట్ల స్కామ్ జరిగిందన్నది వాస్తవమని మహేశ్వర్ రెడ్డి గట్టిగా చెబుతుండగా…. మరోవైపు తాము బ్లాక్ లిస్టులో ఉంచిన కేంద్రీయ భండార్ అనే సంస్థతో ఒప్పందం చేసుకోవడం జేబులు నింపుకోవడానికేనని కేటీఆర్ ఆరోపించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఉత్తమ్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడం అంతలోనే అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెడుతానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేయడంతో నేడు ఆయన వెల్లడించబోయే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారా..? లేదంటే సివిల్ సప్లై అధికారులే ఉత్తమ్ కళ్లుగప్పి అవినీతి చేశారా.. లేక ఉత్తమ్ లక్ష్యంగా ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ కొనసాగుతుందా..? ఒకవేళ స్కామ్ జరిగినా అందుకు సంబంధించిన వివరాలను బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు చేరవేసింది ఎవరు..? అనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.