స్టీల్ ప్లాంట్ నష్టాలు.. రుణ భారం కారణంగా వంద శాతం అమ్మేస్తున్నామని కేంద్రం చెబుతోంది కానీ.. ముగిసిన ఆర్థిక సంవత్సరానికి స్టీల్ ప్లాంట్ పనితీరు చూస్తే అది బంగారు బాతు అని సులువుగానే అర్థమవుతుంది. చాలా కాలం లాక్ డౌన్ ఉన్నప్పటికీ… గత ఆర్థిక సంవత్సరం వైజాగ్ స్టీల్స్ టర్నోవర్ రూ.18 వేల కోట్లు దాటింది. ఇది స్టీల్ ఫ్యాక్టరీ చరిత్రలోనే రెండో అత్యధిక టర్నోవర్. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 2020-21లో కర్మాగారం 13 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతే కాదు.. 4 నెలల్లో రూ.740కోట్ల నికర లాభం నమోదైంది. ఆర్థిక సంవత్సరం చివరి నెల.. ఈ మార్చిలో రూ.3,300కోట్ల ఉక్కును విక్రయించారు.
కర్మాగారం చరిత్రలో ఒక నెలలో వచ్చిన అత్యధిక ఆదాయం అది. ఈ విషయాలను అధికారికంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే ప్రకటించింది. ఇదంతా క్యాప్టివ్ మైన్స్ లేకుండానే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పనితీరు ఇది. నిజంగా క్యాప్టివ్ మైన్స్ కేటాయించి ఉంటే… అత్యధిక లాభాలు ఆర్జింటే స్టీల్ ప్లాంట్లలో ..విశాఖ స్టీల్స్ మొదటి వరుసలో ఉంటుందనడంలో సందేహం ఉండదని నిపుణులు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగ జేఏసీ సంఘం నేతలు కూడా అదే చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని.. రుణభారం ఎక్కువ ఉందనేది …అమ్మేయడానికి కారణాలు వెదుక్కోవడానికేనని అంటున్నారు.
ప్రస్తుతం స్టీల్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో క్యాప్టివ్ మైన్స్ లేకపోయినా ప్లాంట్ లాభాల్లోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తమ నిరసనల్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవి పెరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కాస్త తేడాగా ఉంది.