రామజన్మభూమి వివాదం పరిష్కారం దిశగా సుప్రీం కోర్టు మరో ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఈ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ముగ్గురు ప్రముఖులతో ఒక పేనెల్ వేసింది. త్రిసభ్య కమిటీలోని సభ్యులు ముగ్గురూ మధ్యవర్తిత్వంలో నిపుణులుగా చెబుతున్నారు. కమిటీలో ఒకరైన జస్టిస్ ఖలీఫుల్లా సీనియర్ అడ్వొకేట్, సుప్రీం కోర్టు మాజీ జడ్జి. రెండో నిపుణునిగా శ్రీ రవిశంకర్ ని కోర్టు నియమించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంతో ఆయన చాలామందికి సుపరిచితులు. అయితే, ఈయన భాజపాకి కొంత అనుకూలురు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. మూడో నిపుణుడు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ ని కోర్టు నియమించింది. కొన్ని కీలకమైన కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా ఈయన పరిష్కారాలు చేశారు.
రామజన్మభూమి వివాదంలో నాలుగు వారాల్లోగా మధ్యవర్తిత్వం మొదలు కావాలనీ, ఎనిమిదివారాల్లోగా ప్రక్రియ పూర్తికావాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎనిమిది వారాలంటే సార్వత్రిక ఎన్నికలు దాదాపు పూర్తయ్యే దశలోనో, లేదంటే ఎన్నికల ఫలితాలకు ఎదురుచూస్తున్న దశలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఈ మధ్యవర్తిత్వానికి సంబంధించి జరిగే చర్చలన్నీ అత్యంత రహస్యంగా ఉంచాలనీ, ఫైజాబాద్ కేంద్రంగానే జరగాలనీ, మీడియాలో దీనికి సంబంధించిన ఏ సమాచారమూ రాకూడదనే విధంగా జరుగుతుందని తెలుస్తోంది. చర్చల దశలో మీడియాలో కథనాలు వస్తే రకరకాల అభిప్రాయాలు పెరిగి, భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలా రహస్య చర్చలు జరుపుతున్నారు.
మధ్యవర్తిత్వం ద్వారానే ఇరువర్గాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సుప్రీం కోర్టు చూపగలిగితే, కచ్చితంగా మంచి పరిణామమే అవుతుంది. అయితే, గతంలో కూడా మధ్యవర్తిత్వం కోసం అలహాబాద్ కోర్టులోని లక్నో బెంచ్ ప్రయత్నించింది. అంతకుముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు కొన్ని జరిగినా, ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న వాతావరణం ఏంటంటే… ఈ కేసులో ముగ్గురు ప్రధాన కక్షిదారుల్లో తాజా ప్రయత్నానికి ఇద్దరు సానుకూలంగా ఉన్నారు. మూడోపక్షం నుంచే కొంత వ్యతిరేకత వినిపిస్తోంది. అయితే, చర్చల ప్రక్రియ ప్రారంభమైతే అందరికీ ఆమోదయోగ్యమైన దిశగానే వివాదం పరిష్కారానికి ఒక మార్గం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమౌతోంది.