ఎలక్టోరల్ బాండ్ల గుట్టు అంతా బయటకు వచ్చింది. వాట్ నెక్ట్స్ ? అనేది మాత్రం ఇప్పుడు ఎవరికీ తెలియదు. రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు చూస్తే అత్యధిక క్విడ్ ప్రో కో అని స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీలు ఆయా సంస్థలకు మేలు చేసి అందుబదులుగా ఎలక్టోరల్ బాండ్ల పేరుతో విరాళాలు తీసుకున్నాయన్నది స్పష్టమైన నిజం.
ఈ విషయంలో బీజేపీ అతి పెద్ద అనుమానిత పార్టీ. ఎందుకంటే ఆ పార్టీకే అత్యధిక విరాళాలు రావడం.. కాంట్రాక్టులు, కొన్ని సంస్థలపై దర్యాప్తు సంస్థల దాడుల తర్వాత విరాళాలు రావడం, ఆ కేసులు మళ్లీ బయటకు రాకపోవడం వంటివి ఉన్నాయి. ఇక తృణమూల్, డీఎంకే కూడా అంతే. వైసీపీ ఆర్థిక వ్యవహారాలు ఇంకా ఘోరంగా ఉన్నాయి. గేమింగ్ సంస్థ అత్యధికంగా వైసీపీకి విరాళం ఇచ్చింది ?. సగానికిపైగా .. ఈ ఐదేళ్లలో రెన్యూవబుల్ ఎనర్జీ పేరుతో చేసుకున్న ఒప్పందాలకు తగ్గట్లుగా పెద్ద ఎత్తున భూములు ఇచ్చి తమ ఖాతాలో డబ్బులు వేయించుకున్నారు. టీడీపీకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కూడా రూ. 40 కోట్లు ఇచ్చింది. సీఐడీ చెప్పినట్లుగా… స్కిల్ కేసులో ఉన్న ఒక్క కంపెనీ కూడా టీడీపీకి రూపాయి ఇవ్వలేదు.
ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు . అన్ని పార్టీలు ఎలక్టోరల్ బాండ్లను దుర్వినియోగం చేశాయి. తమ అవినీతికి రాచబాట వేసుకున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందన్నది కీలకం. వివరాలన్నీ బహిర్గతమయ్యాయి కాబట్టి.. ప్రజలదే నిర్ణయమంటారా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుందా అనేది ఆసక్తికరం.