శాసనమండలిలో తమకున్న బలంతో కూటమి సర్కార్ ను ఇరుకున పెట్టాలని భావించిన జగన్ రెడ్డి కలలు కల్లలు కానున్నాయా..? వైసీపీ లు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారా..? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.
బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్ క్యాంప్ కార్యాలయంలో విశాఖ, తిరుపతి, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్టితి, చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలతో జగన్ రెడ్డి చర్చించారు. మండలిలో వైసీపీకే ఎక్కువ బలం ఉన్నప్పటికీ…త్వరలోనే కొంతమంది ఎమ్మెల్సీలు పార్టీని వీడే అవకాశం ఉందని నేతలతో చెప్పినట్లుగా సమాచారం.
పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునే వెళ్లిపోతారు.. అలాంటి వారిని ఎంతకాలం ఆపగలం. అది వారిష్టం. విలువలు, నైతికత అనేవి ఉండాలి. వెళ్ళేవారు వెళ్ళనివ్వండి.. నిలబడాలనుకునే వారు నాతో ఉంటారంటూ జగన్ అభిప్రాయపడినట్లుగా తెలిసింది. పార్టీ పెట్టినప్పుడు అమ్మా, నేనూ ఇద్దరమే ఉన్నాం.. అయినా ఇంతదూరం వచ్చేశాం..ఇబ్బందేమీ లేదు. మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం అని జగన్ ఆవేదనతో మాట్లాడినట్లుగా సమాచారం.
అయితే, ఎమ్మెల్సీలు ఎవరెవరు వైసీపీని వీడుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కౌన్సిల్ లో తమకున్న సంఖ్యాబలంతో రచ్చ చేద్దామనుకున్నా జగన్ రెడ్డి ప్రయత్నాలకు ఆ పార్టీ నేతలే చెక్ పెడుతున్నారు. జగన్ ఆవేశానికి లోనై మండలిలో రచ్చ చేద్దామనుకుంటే పరిస్థితులు మాత్రం అందుకు విరుద్దంగా మారాయంటూ ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పైగా.. ఇప్పుడున్న సమయంలో అమరావతి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి కీలక బిల్లులను తీసుకురానుంది సర్కార్. వీటికి శాసనమండలిలో వైసీపీ అడ్డు తగలడం ఖాయమే. ఇలాంటి బిల్లులను వ్యతిరేకిస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని భావించి వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
అయితే, ఎంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారు..? అనర్హత వేటు పడకుండా తెలివిగా మండలిలో వైసీపీ పక్షాన్ని టీడీపీలో విలీనం విలీనం చేస్తారా..? అనే చర్చ కూడా జరుగుతోంది.