ఏపీలో వైన్ షాపుల ముందు కనిపించిన క్యూలు చూసి – మందు బాబుల హంగామా చూసి జనాలు నవ్వుకున్నారు, సెటైర్లు వేసుకున్నారు, ఆశ్చర్యపోయారు, కొండో కచో… భయపడ్డారు. కరోనా మహమ్మారి కబళిస్తున్న వేళ – సామాజిక దూరం పాటించకుండా మందు కోసం ఎగబడడం ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. దీనిపై రకరకాల విశ్లేషణలు. ఈ క్యూలు చూసి ఎవరు భయపడినా, ఎవరు బాధపడినా… సినీ పరిశ్రమ మాత్రం కొండంత ధైర్యం తెచ్చుకుని ఉంటుంది. రేపు థియేటర్లు తెరచుకున్నా ఇలాంటి క్యూలే కనిపిస్తాయన్న భరోసా దొరికి ఉంటుంది. చిత్ర పరిశ్రమకు చెందినంత వరకూ ఇది శుభ సూచకమే.
కరోనా వల్ల సగటు జీవి జీవితం అస్తవ్యస్థమైంది. దమ్మిడీ ఆదాయం లేదు. కొలువులు పోతున్నాయి. నిల్వలు తగ్గుతున్నాయి. పేదవాడి సంగతి సరేసరి. మధ్య తరగతి వాడి నడ్డి విరిగింది. ఇలాంటి సమయంలో థియేటర్లు తెరచుకున్నా… వినోదం కోసం జేబులోంచి డబ్బు తీయగలడా? కనీస అవసరాల్ని సైతం తీర్చుకోలేని స్థితిలో సినిమా టికెట్టు కోసం డబ్బుల్ని వెచ్చించగలడా? అనే అనుమానాలు నెలకొన్నాయి. పైగా కరోనా భయం ఒకటి. కరోనాకు వాక్సిన్ దొరికేంత వరకూ థియేటర్లు నిండుకోవని సురేష్ బాబు లాంటి సినీ దిగ్గజాలే సెలవిచ్చేశారు. అది నిజం కూడా. ఎందుకంటే.. సామాజిక దూరం పాటించకపోతే కరోనా మరింత రెచ్చిపోతుంటుంది. థియేటర్ల దగ్గర సామాజిక దూరం లాంటి సూత్రాలు పాటించడం అసాధ్యం. టికెట్ల దగ్గర తోపులాట.. థియేటర్లలో జన సమూహం.. కరోనా కబళించడానికి రాజ మార్గాలు. అందుకే.. థియేటర్లు తెరుచుకున్నా.. భయం కొద్దీ జనాలు రారు.. అని ఫిక్సయిపోయారు.
కానీ వైన్ షాపుల్ని చూడండి. ఒక్కో షాపు ముందు 5 గురు కష్టమర్లు మించకూడదు.. అని ప్రభుత్వం చెబితే – వందలు, వేల మంది గుమ్మిగూడుతున్నారు. కిలో మీటర్ల కొద్దీ క్యూలు వ్యాపించాయి. ఆడ వాళ్లు సైతం క్యూలో దర్జాగా నిలబడిపోతున్నారు. ఏ ఒక్కరినీ కరోనా భయం లేదు. నాలుగు `మందు` చుక్కలు వేసుకుని గొంతు తడుపుకోవాలన్న ఆశయం తప్ప. మరి సినిమాకీ తెలుగు ప్రజలు ఇంతే ప్రాధాన్యం ఇవ్వకుండా ఎలా ఉంటారు..? సినిమా అనేది తెలుగు ప్రజల ముఖ్య వినోద సాధనం. సాయింత్రం అయ్యేసరికి కాళ్లు, కళ్లు థియేటర్ల వైపు చూస్తుంటాయి. అది మందు కన్నా.. బాగా ముదిరిపోయిన బలహీనత. పైగా.. సగటు జీవికి అందుబాటులో ఉన్న వినోద సాధనం. థియేటర్లు తెరచుకున్నా ఇలానే క్యూలతో కిటకిటలాడిపోవడం ఖాయంగానే ఉంది. ఇక ఆర్థిక సమస్యలంటారా?? మందు బాటిలుపై 25 శాతం ధర పెంచినా కూడా… జనం తండోపతండాలుగా ఎగబడుతున్నారంటే… సినిమా దాని కంటే చీపు కదా? ఆర్థిక మాన్యంలోనూ అప్పు చేసి మరీ తాగుతున్నారంటే సినిమా దాని కంటే దిగజారిపోయిందా? పైగా వారానికి ఒకటో, రెండో సినిమాలు. అంతే. మందైతే అలా కాదు కదా, రోజూ సాయింత్రం అయ్యే సరికి, గొంతు తడుపుకోవాలి. సో.. ఇవన్నీ ఆలోచిస్తే థియేటర్లకు జనం రారు అనే మాటలో పెద్దగా నిజం లేదనిపిస్తోంది. చూద్దాం… లాక్ డౌన్ ఎత్తేశాక, థియేటర్లు తెరచుకున్నాక, తెలుగు జనాలు సినిమాపై ఎంత ప్రేమ చూపిస్తారో? నిర్మాతలు కూడా ఆ తరుణం కోసమే ఆశగా ఎదురు చూస్తున్నారు.