ఆన్లైన్ టిక్కెట్లు, సినిమాల కలెక్షన్లను గుప్పిట పెట్టుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ కావట్లేదు. తమ ఆదాయాన్నంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి.. ప్రభుత్వం ఇచ్చే దాని కోసం వెయిట్ చేయడం కన్నా అసలు ధియేటర్లు మూసుకోవడమే మంచిదన్న భావనలో ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడినా.. చివరికి యాప్ మాత్రమే కాదు బుక్ మై షో కూడా ఉంటుందని చెప్పినా.. ఒక్క రోజులోనే నగదు జమ చేస్తామని చెప్పినా ఎగ్జిబిటర్లు నమ్మడం లేదు.
అసలే ధియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతూండటం ప్రభుత్వం వివిధ రకాల పన్నుల పేరుతో బాదుడు చేపట్టడం.. చివరికి ఇష్టం లేని హీరోల సినిమాలు వస్తే కలెక్షన్లు తగ్గించడానికి సీజ్ కూడా చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వంతో పెట్టుకోవడం కన్నా.. సైలెంట్‌గా ఉండటం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ కూడా.. ఓ ప్రతిపాదన పెట్టింది. కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ కోర్టు కేసులు ఇతర కారణాల వల్ల కొన్ని మినహాయింపులు ఇస్తూ.. తమ యాప్ లో గెట్ వే చార్జెస్ ఉండవని.. ఇతర ఒప్పందాలు కూడా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎగ్జిబిటర్లు నమ్మడం లేదు.
ఇప్పటికే ఈస్ట్ గోదావరిలో ధియేటర్లన్నీ మూసి వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇతర జిల్లాల వాళ్లు కూడా అదే నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ప్రతీ రోజు ఏపీలో సినిమా ధియేటర్లకు వచ్చే కలెక్షన్ ప్రభుత్వం ఖాతాలో పడనుంది. అక్కడ్నుంచి ఎవరివి వారికి తర్వాత రోజు ఇవ్వనున్నారు. అలా చెప్పారు కానీ ఇస్తారని ఎవరూ నమ్మడం లేదు. అందుకే ఎంవోయూకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎంవోయూ చేసుకోకపోతే .. అనుమతులన్నీ రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని కంటే ముందే తాము ధియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకుంటున్నారు. హైకోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరుగుతోంది.