ఈ నెల ఆరో తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న విభజన సమస్యలకు పరిష్కామే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది. ఎజెండాలో చాలా అంశాలు కనిపిస్తున్నప్పటికీ.. ప్రధానంగా ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపేలా చంద్రబాబును ఒప్పించాలని రేవంత్ ను బీఆర్ఎస్ కోరుతోంది.
నిజానికి ఆ ఏడు మండలాల ప్రజలు తెలంగాణలో విలీనం కావాలనే కోరుకుంటున్నారు. పలుమార్లు ఈ విషయాన్ని బయటపెట్టారు. కానీ, అప్పట్లో ఈ అంశాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ అండ్ జగన్ రెడ్డిలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం, ఎన్డీయేలో చంద్రబాబు కీలకంగా ఉండటం.. విభజన సమస్యలకు పరిష్కారం కోసం ఆయన వైపు నుంచి సానుకూలత రావడంతో విభజన సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశలు చిగురిస్తున్నాయి.
దీంతో ఏడు మండలాల విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారు..? ఈ విషయంలో రేవంత్, చంద్రబాబును ఎలా ఒప్పిస్తారు..? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే, ప్రజల కోరిక మేరకు ఏడు మండలాలను తెలంగాణలో విలీనం విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తే మాత్రం అది రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది అవుతుంది. అదే సమయంలో గతంలో ఇలాంటి చొరవ ప్రదర్శించలేదని బీఆర్ఎస్ పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపనుండగా.. కాంగ్రెస్ , టీడీపీలపై ఏడు మండలాల ప్రజల్లో సదాభిప్రాయం నెలకొనే అవకాశం ఉంటుంది.
ఇదే వైఖరితో మిగిలిన విభజన సమస్యలను ఓ కొలికి తీసుకువస్తారనే అంచనాకు ఇది శుభారంభం కానుంది.