వైసీపీ ప్లీనరీలో ఈ సారి రూల్స్ పూర్తిగా మార్చేస్తున్నారు. శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ ఇంకో విషయం వైసీపీలోనూ అంతర్గతంగా హాట్ టాపిక్ అవుతోంది. అదేమిటంటే కొత్త రూల్స్‌లో గౌరవాధ్యక్ష పదవి ఉంటుందా ఉండదా అనేదే. ప్రస్తుతం గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ ఉన్నారు. ఆమె పార్టీలో ఉన్నారో లేదో స్పష్టత లేదు. ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ప్లీనరీకి వస్తారో లేదో చివరిక్షణం వరకూ తెలియదు. కుమార్తె పార్టీ కోసమే ఆమె కష్టపడుతున్నారు.
అదే సమయంలో సీఎం జగన్‌తో ఆమెకు సత్సంబంధాలు లేవని చెబుతున్నారు ఈ కారణంగా ఆమె గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇంత వరకూ ఎలాంటి రాజీనామా జరగలేదు. ప్లీనరీ తర్వాత రాజీనామా చేస్తారని కొంత కాలంగా చెబుతున్నారు. ఆమె రాజీనామా చేయకుండా ఇప్పుడు నియామవళిలో అసలు గౌరవాధ్యక్ష పదవి లేకుండా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని వైసీపీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ ఆలోచనే నిజం అయితే శుక్రవారమే… వైఎస్ విజయలక్ష్మికి వైసీపీ గౌరవాధ్యక్షరాలిగా చివరిరోజు అనుకోవచ్చు. ఈ పరిణామంపై వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ… విపక్షాలు మాత్రం తల్లిని వదిలించేసుకున్నారన్న ఆరోపణలు మాత్రం జోరుగా చేస్తాయి.