తిరుపతి మొత్తం దొంగఓట్ల మయం అయిందని మీడియా ఆధారాలతో వెలుగులోకి తీసుకు వచ్చింది. ఒక్క పోలింగ్ అధికారి కానీ పోలీసు అధికారి కానీ ఈ దొంగ ఓట్లను అరికట్టే విషయంలో చురుకుగా వ్యవహరించలేదు. అటు ఎన్నికల ప్రధాన అధికారి.. దొంగ ఓట్లను అరికట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇటు పక్క డీజీపీ దొంగ ఓటర్లెవరూ రాలేదని ..ప్రశాంతంగా జరుగుతోందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. దాంతో అధికారయంత్రాంగం పరంగా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం అసలు జరగదని తేలిపోయింది. అదే పద్దతిలో ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లాయి. సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఓటర్ ఐడీ కార్డులు నకిలీవి ముద్రించడం తీవ్రమైన నేరం. అలాంటివి కొన్ని వందలు, వేలు ముద్రించినట్లుగా నిర్ధారణ అయింది. మామూలుగా ఇలాంటి ఓటర్ కార్డుతో పట్టుబడిన వారిని తక్షణం అదుపులోకి తీసుకుని… మొత్తం గ్యాంగ్ గుట్టురట్టు చేయాల్సి ఉంది. కానీ పట్టుబడిన వారిని పట్టుబడినట్లుగా పోలీసులు వదిలేశారు. కేసులు నమోదు చేసినట్లుగా కూడా లేదు. అదే సమయంలో స్వయంగా అధికారంలో ఉన్న వాళ్లే.. వారు నకిలీ ఓటర్లు కాదని.. దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులని.. మరొకటని వాదిస్తోంది. వారికి మద్దతుగా మంత్రి స్వయంగా తిరుపతిలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటంతో ఇక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోయింది.
లోక్‌సభ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఆయన ఇచ్చే నివేదికను బట్టే… తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుంది. విపక్ష పార్టీలు.. అన్ని ఏడు నియోజకవర్గాల్లో రీపోలింగ్ అడగడం లేదు. ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే రీపోలింగ్ ఉండాలని కోరుతున్నాయి. దానికి వారి వద్ద స్పష్టమైన కారణం ఉంది. కానీ… ప్రభుత్వం మాత్రం.. ఇప్పటికే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించింది. రీపోలింగ్‌కు ఆదేశిస్తే.. ఈసీ తనను తాను అవమానించుకున్నట్లేనని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ఆదేశించకపోతే.. ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లు అవుతుందని ఇతర పార్టీలు అంటున్నాయి.
దొంగ ఓట్ల వ్యవహారంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే… ప్రజల్లో ప్రజాస్వామ్యంపైన… ఎన్నికలు నిర్వహించే వ్యవస్థలపైనా అనుమానం పెరిగిపోతుంది. అది అంతిమంగా ప్రజాస్వామ్యానికే చేటు చేస్తుంది. ప్రజాస్వామ్యం రక్షితోరక్షిత అంటారు… ప్రజాస్వామ్యం కాపాడితే.. అది వ్యవస్థల్ని కాపాడుతుంది. లేకపోతే.. ప్రజాస్వామ్యమే కాదు.. వ్యవస్థలూ కూలిపోతాయి. దీని వల్ల.. దేశమే నష్టపోతుంది.