సినిమాలు తీస్తే నిర్మాతలు అవుతారు. అంతేగానీ, ఎమ్మెల్యేలు అవుతారా..? ఏమో, అవుతారేమో… ఆయన తీరు చూస్తే అలానే ఉంది. సినిమా థియేటర్ టిక్కెట్ కౌంటర్ నుంచీ మొదలుపెట్టి, ఎమ్మెల్యే టిక్కెట్ పట్టేయాలన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఇంతకీ, ఆ నాయకుడు ఎవరంటే.. రాకేష్ రెడ్డి. అలా చెప్పే కంటే… లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత అని చెబితే ఈజీగా గుర్తు పట్టొచ్చు. సరిగ్గా ఆయన కోరుకుంటున్న గుర్తింపూ ఇదే. అందుకే, ఏరికోరి మరీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఎంచుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం గురించి టీడీపీ నేతలు సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక సినిమాను సినిమాగా తీయాలీ అనే జానర్ నుంచి వివాదాస్పదంగా తీస్తే చాలు అనే స్థాయికి వర్మ వచ్చేశారు. దర్శకుడిగా దీన్ని ఆయన ఎదుగుదల అనాలో, దిగజారుడు అనాలో అనేది వేరే చర్చ!
లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి వైకాపా నాయకుడు. ఈయన గతంలో సినిమాలు తీసిన అనుభవం లేదు. బెంగళూరులో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. పలమనేరు నియోజక వర్గానికి చెందినవారు. ఇదే నియోజక వర్గం నుంచి వైకాపా టిక్కెట్ పై అమర్ నాథ్ రెడ్డి గెలిచారు. కానీ, తరువాత ఆయన జగన్ తో విభేదించి టీడీపీలో చేరిపోయి, మంత్రి అయ్యారు. ఆయన వెళ్లాక వైకాపాకి పలమనేరులో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. దీంతో పార్టీ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నవారే పెద్ద దిక్కు అయ్యారు. అయితే, వారందరూ వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ముందు తమ బలమేంటో ప్రదర్శించుకోవాల్సిన ఒక అనివార్యత ఏర్పడింది. అందుకే, సమన్వయకర్తల్లో ఒకరైన రాకేష్ రెడ్డి నిర్మాత అవతారం ఎత్తారు అంటున్నారు! లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విలన్ గా చూపించొచ్చనీ, ఆ రకంగా వైకాపా ఆశీస్సులు పొందొచ్చనే ఉద్దేశంతోనే ఆయన నిర్మాతగా మారారని చెప్పుకుంటున్నారు. తద్వారా పలమనేరు టిక్కెట్ తనకే దక్కుతుందనేది ఆయన వ్యూహంగా తెలుస్తోంది.
రాకేష్ రెడ్డిగానీ ఆయన అనుచర వైకాపా గణంగానీ మిస్ అవుతున్న లాజిక్ ఒకటుంది. పలమనేరులో మంత్రి అమర్ నాథ్ రెడ్డికి మంచి పట్టుంది. ఆయన టీడీపీలో చేరడం, ఆ పార్టీకి చాలా ప్లస్ అయింది. అధికార పార్టీలో చేరిన తరువాత ఆయన పట్టు మరింత పెరిగిందనే చెబుతున్నారు. ఇలాంటి నియోజక వర్గంలో వైకాపా నుంచి టిక్కెట్ ఆశిస్తే… తీయాల్సింది సినిమా కాదు, తీసుకుని రావాల్సిన రామ్ గోపాల్ వర్మను అంతకన్నా కాదు. నియోజక వర్గంపై దృష్టి పెట్టాలి. కేడర్ బలోపేతంపై శ్రద్ధ తీసుకోవాలి. అధికార పార్టీ లోపాలపై కన్నేసి, కార్యాచరణ చేపట్టాలి. దీంతోపాటు పార్టీలోని ఇతర నేతల మద్దతును కూడగట్టుకోవాలి. అమర్ నాథ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనే స్థాయి నాయకుడిగా చూపించుకోవాలి. ఇవన్నీ వదిలేసి.. కేవలం ఒక సినిమా తీసి జగన్ ను సంతృప్తి పరచి టిక్కెట్ దక్కించుకోవడమే గొప్ప వ్యూహం అన్నట్టుగా ఆ నేత వైఖరి కనిపిస్తోంది. అయినా, రాకేష్ రెడ్డి ఆశిస్తున్న స్థాయిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తారన్న నమ్మకం ఏముంది..?