ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేశారంటూ నమోదైన కేసులో తెలంగాణ సర్కార్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా పేరున్న సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్‌ను నియమించింది. సీనియర్ అధికారులు ఇందులో భాగంగా ఉన్నారు. నిందితుల్ని కోర్టు రెండు రోజుల కస్టడీకి ఇచ్చింది. వారిని ప్రశ్నించిన తర్వాత సిట్ ఎలాంటి అడుగులు వేస్తుందనేది కీలకంగా మారింది. ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో ఈ డీల్స్‌కు సంబంధించిన ఆడియో వీడియోలన్నింటినీ కేసీఆర్ బహిరంగంగా విడుదల చేశారు.
అన్ని మీడియా సంస్థలతో పాటు న్యాయమూర్తులకూ పంపించారు. ఈ కేసును సాదాసీదాగా చూడవద్దని కోరారు. అదే సమయంలో తెలంగాణ పోలీసులే కేసు విచారణ జరుపుతూండటం.. పూర్తి స్థాయ ఆధారాలు ఉన్నాయని సీఎం ప్రకటించడంతో సిట్ ఎలాంటి ముందడుగు వేయబోతోందన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మొత్తం 23 మందితో ముఠా ఉందని కేసీఆర్ ప్రకటించారు. ఈ ముఠా నాయకుడు ఎవరన్నది కూడా తేలాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు కీలకం.
ఈ కేసు విషయంలో ఉన్న ఆధారాలన్నీ మాటల ద్వారానే ఉన్నాయి. డాక్యుమెంట్ల రూపంలో లేవు. డబ్బులు ఎలా తరలించారు.. ఎంత తరలించారు.. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలకు ఎలా చెల్లింపులు చేశారన్నది కూడా సిట్ బృందం బయటకు లాగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ పోలీసులు ఈ కేసు విషయంలో అన్ని ఆధారాలు సేకరిస్తే.. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా సంచలనం అయ్యే అవకాశాలున్నాయి. కానీ తెలంగాణ పోలీసులు .. టేపుల్లో ఉన్నట్లుగా కనీసం అమిత్ షాకు కాకపోయినా… కింగ్‌పిన్‌గా చెబుతున్న బీఎల్ సంతోష్కైనా నోటీసులు జారీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.