ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో ఇద్దరు వైసీపీ ఎంపీలు ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఆలోచనలో పడ్డారు. వైసీపీలో కొనసాగితే ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమి లేకున్నా కేసుల కారణంగా త్వరలో జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఆ ఇద్దరూ తమ ముందున్న ఆప్షన్స్ ను సీరియస్ గా పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీకి రాజ్యసభలో 11మంది ఎంపీలు ఉండగా.. లోక్ సభలో నలుగురు ఉన్నారు. ఇందులో రాజ్యసభ నుంచి విజయసాయిరెడ్డి, లోక్ సభ నుంచి అవినాష్ రెడ్డిలకు భవిష్యత్ భయం పట్టుకుందన్న టాక్ వినిపిస్తోంది. జగన్ తోపాటు అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డిపై అరెస్ట్ కత్తి వేలాడుతోంది. ఇన్నాళ్ళు వైసీపీ అధికారంలో ఉండటంతో సేఫ్ జోన్ లో ఉన్నా, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో విజయసాయిరెడ్డి ఆందోళన చెందుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో విజయసాయిరెడ్డి వైసీపీలోనే కొనసాగుతారా.? వ్యూహంలో భాగంగా తాను సేఫ్ జోన్ లో ఉండేందుకు బీజేపీలో చేరుతారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు వివేకా హత్యా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి కూడా భవిష్యత్ బెంగ పట్టుకుందని అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన్ను ఎలాగూ వెంటాడుతారు. అందుకే బీజేపీలో చేరేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నిస్తారని ప్రచారం నడుస్తోంది.
అయితే, అటు విజయసాయిరెడ్డి, ఇటు అవినాష్ రెడ్డిలు తెలివిగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు బ్రేకులు వేయకుండా ఉంటారా..? అనేది కీలకాంశం. ఎందుకంటే ఎన్డీయేలో చంద్రబాబు కీలకం కావడంతో ఏపీ నుంచి చేరికల విషయంలో బీజేపీ ఆయనతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. దీంతో ఆ ఇద్దరు వైసీపీ నేతలు ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి.
విజయసాయి విషయంలో ఎలా ఉన్నా…అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిక విషయంలో మాత్రం చంద్రబాబు అభ్యంతరం చెబుతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.