మూడు రాజధానుల అంశంలో అనుకున్నది చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ సర్కార్ … మండలిలో పెండింగ్లో ఉన్న బిల్లులనే మరోసారి అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేసుకుంది. ఇప్పుడు ఆ బిల్లులు మళ్లీ మండలికి వెళ్లబోతున్నాయి. అప్పటికి ఇప్పటికి మండలి బలాల్లో పెద్ద తేడా లేదు. ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రమే అధికారికంగా వైసీపీకి మద్దతు పలికారు. అంటే.. ఫిరాయింపులు లేకపోతే.. ఆ బిల్లు వీగిపోవడం ఖాయమే. వైసీపీ అగ్రనేతలు ఇప్పటికే చాలా రోజులుగా… మండలిపై ప్రత్యేక దృష్టి పెట్టి కసరత్తు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు అంతర్గతంగా ఫలించి ఉంటే… పలువురు ఎమ్మెల్సీలు.. ఓటింగ్ సమయంలో టీడీపీకి షాక్ ఇచ్చి.. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుకు మద్దతు తెలిపే అవకాశం ఉంది.
ఒక వేళ టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరూ ఫిరాయించకపోయినా… ఆ బిల్లులకు మద్దతు తెలియచేయకపోయినా… సర్కార్కు వచ్చే ఇబ్బందేమీ లేదు. మళ్లీ ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపితేనే సమస్య వస్తుంది. కొన్నాళ్ల పాటు ఆగుతుంది. ఒక వేళ శాసనమండలి తిరస్కరించినా.. మళ్లీ ఆ బిల్లును శాసనసభలో ఆమోదించి.. పాసయిందని గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపడానికి అవసరమైన నిబంధలను అధికారపక్షం రెడీ చేసుకుంది. శాసనమండలి… గరిష్టంగా బిల్లును నాలుగు నెలలకు మించి ఆపలేరన్న నిబంధనలను బయటకు తీసుకు వచ్చారు. దీంతో.. ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ఉందని అర్థం చేసుకోవచ్చంటున్నారు.
శాసనమండలిలో బిల్లును వ్యతిరేకించినా.. ఆమోదించినా.. ఇబ్బంది లేకుండా.. తమ మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చుకోవడానికి అవసరమైన కసరత్తు చేసిన తర్వాతనే ఏపీ సర్కార్.. మరోసారి ఆ బిల్లులను ప్రవేశ పెట్టిందని భావిస్తున్నారు. అందుకే.. గవర్నర్ ప్రసంగంలోనూ.. మూడు రాజధానుల అంశాన్ని చేర్చి.. శాసన ప్రక్రియ నడుస్తోందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ సర్కార్.. తాను అనుకున్నది చేయడం ఖాయమే. ఇప్పటి వరకూ.. రంగుల నుంచి ఇంగ్లిష్ మీడియం వరకూ కోర్టుల్ని.. చట్టాల్ని పట్టించుకోలేదు… కాబట్టి.. ఈ విషయంలోనూ… లెక్క చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు.
అయితే.. ఏపీ సర్కార్ ప్రయత్నం మాత్రం.. ఓ కొత్త రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. అదే.. సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లుల్ని మళ్లీ పెట్టి ఆమోదించుకోవడం రాజ్యాంగబద్ధమేనా…? హైకోర్టులో ప్రభుత్వం స్వయంగా.. బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయని ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఆ ప్రక్రియ పూర్తి కాకుండా బిల్లులు మళ్లీ పెట్టడం న్యాయమేనా..? ఈ అంశాలు తేలాల్సి ఉంది.