బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యవసరంగా నిర్వహించిన సమావేశానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల కొద్ది రోజులుగా పదుల సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఈ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ కీలక సమావేశానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతోన్న నేపథ్యంలో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ తో భేటీకి డుమ్మా కొట్టడం సందేహాలకు తావిస్తోంది.
ఈ అత్యవసర భేటీకి డుమ్మా కొట్టిన గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేల చేరికలకు సంబంధించి కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేయగానే కారు దిగేందుకు రెడీగా ఉన్నారని… రేవంత్ నుంచి అనుమతి రావడమే ఆలస్యం వీరంతా బీఆర్ఎస్ ను వీడుతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లోపే బీఆర్ఎస్ ఎల్పీ విలీనాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తుండగా…కేసీఆర్ అత్యవసరంగా నిర్వహించిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో తొందర్లోనే వీరు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమని అంటున్నారు. అయితే, ఈ అత్యవసర మీటింగ్ కు కేటీఆర్ కూడా హాజరు కాకపోవడంతో ఎందుకు ఆయన ఈ సమావేశానికి డుమ్మా కొట్టారనే చర్చ జరుగుతోంది.