ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబోలో ఓ సినిమా రాబోతోంది.
బన్నీకి వెట్రిమారన్ ఓ కథ చెప్పాడు.
మహేష్ కూడా వెట్రిమారన్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
ఈ మాటలు, వార్తలు వినడానికి ఆసక్తికరంగానే ఉండొచ్చు. వెట్రిమారన్‌తో తెలుగు స్టార్ హీరోల కలయిక.. నిజంగానే కొత్తగా, థ్రిల్లింగ్ గా అనిపించి ఉండొచ్చు. కాకపోతే… ఈ కాంబోలు సాధ్యమేనా? అనేది పెద్ద ప్రశ్న. మన హీరోలకు పేంపరింగ్ అలవాటైపోయింది. దర్శకుడెప్పుడూ.. హీరోల ఇమేజ్‌లకు, స్టైల్ లకు అనుగుణమైన కథలతోనే వెళ్తారు. వాళ్లని కొంచెం కూడా కష్టపడనివ్వరు. పుష్పలో బన్నీ కష్టపడలేదా? అంటే… అక్కడ బన్నీ కష్టం కనిపిస్తోంది. కాకపోతే.. అది కూడా పూర్తిగా కమర్షియల్ మీటర్లో సాగే సినిమా.
వెట్రిమారన్ కథలు, పాత్రలూ అలా ఉండవు. ఆయనసినిమాల్లో హీరోయిజం కనిపించదు. మనహీరోలకు నచ్చే, ఆర్టిఫిషియల్ అంశాలు ఏమీ ఉండవు. అంత `రానెస్` భరించడం మనవాళ్లకు కష్టమే. పైగా వెట్రిమారన్ వర్కింగ్ స్టైల్ మన దర్శకులకంటే భిన్నంగా ఉంటుంది. రేపు సెట్లో ఏం సీన్ తీయాలో.. ఈరోజు కూడా వెట్రిమారన్ డిసైడ్ చేసుకోలేడట. సెట్ కి వెళ్లాక తనకు ఏం అనిపిస్తే అది చేసుకొంటూ వెళ్తాడట. ఈ విషయం తనే స్వయంగా చెప్పాడు. `నాకు క్లారిటీ ఉండదు.. 10 రోజుల్లో తీయాల్సిన సినిమాని 20 రోజుల్లో తీస్తా` అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఇదంతా వెట్రిమారన్ స్టైల్. దానికి అలవాటు పడినవాళ్లే.. ఆయనతో సినిమాలు తీశారు, తీస్తున్నారు. సెట్లో రోజంతా కూర్చుని, వెట్రిమరన్ కి సీన్ పై గ్రిప్ కుదిరేంత వరకూ… ఆయన ఆధీనంలోనే ఉండాలి హీరోలు. అలాంటి వాళ్లతోనే ఆయన పని చేస్తారు. ఇవన్నీ మన హీరోలకు అస్సలు పడని వ్యవహారాలు. హీరోలు వెళ్లినప్పుడే సీన్లు తీసుకోవాలి. వాళ్లకు ఇష్టమొచ్చినప్పుడు `పేకప్` చెప్పాలి. ఇలాంటి గొడవలే ఉంటాయి. అందుకే ఈ కాంబోలు పేపర్ పై బాగుంటాయి కానీ, సెట్స్‌కి వెళ్తే పేచీలు మొదలైపోతాయి. కమర్షియల్ హీరోలతో వచ్చే ఇబ్బందులు వెట్రిమారన్‌కి తెలుసు. వెట్రిమారన్ స్టైల్ ఏంటో మన వాళ్లకు తెలుసు. అందుకే ఈ కాంబోలు సెట్ అవ్వడం, సెట్‌పైకి వెళ్లడం కష్టం. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప.