పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ ల మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి మైత్రీ `జల్సా` నుంచీ కొనసాగుతూనే ఉంది. `అజ్ఞాతవాసి`లాంటి డిజాస్టర్ కూడా వీరిద్దరి స్నేహానికి అడ్డు పడలేదు. పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని, ఆయన అనుకున్న ఆశయాన్ని అందుకోవాలని ఆకాంక్షించిన వాళ్లలో త్రివిక్రమ్ ప్రధముడు.
ఇప్పుడు పవన్ భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేస్తున్నాడు. భీమవరం త్రివిక్రమ్ పుట్టిన ఊరు. అక్కడ త్రివిక్రమ్ అభిమానులు పెద్దసంఖ్యలో ఉన్నారు. పవన్ ప్రచారంలో భాగంగా త్రివిక్రమ్ కూడా వస్తే బాగుంటుందన్నది భీమవరం వాసుల ఆశ. అయితే.. త్రివిక్రమ్ ఎప్పుడూ రాజకీయాలకు దూరమే. `నాకసలు రాజకీయాలేం తెలీవు` అంటుంటాడు. అలాంటిది ఇప్పుడు మైకు పట్టుకుని మిత్రుడ్ని గెలిపించమని ఎలా అడుగుతాడు..? తన సినిమా పనిలో తాను బిజీగా ఉన్నాడు. పైగా పవన్‌కి కూడా ఈ ఎన్నికల కూపంలోని తన మిత్రుల్ని గానీ, కుటుంబ సభ్యుల్ని గానీ దించాలని లేదు. భీమవరం పవన్ సామాజిక వర్గానికి చాలా పట్టున్న ప్రాంతం. ఇక్కడ పవన్ ప్రచారం చేయకపోయినా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి చోట.. ప్రచారం కోసం త్రివిక్రమ్ ని దించాల్సిన అవసరం ఏముంది? పవన్‌కి త్రివిక్రమ్ సహాయం ఏమైనా ఉంటే, పరోక్షంగా ఉండొచ్చేమో. ప్రత్యక్షంగా మాత్రం ఉండే అవకాశాలు లేనట్టే..!