రోజా ఎపిసోడ్లో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. రోజాతో పాటు మొత్తం అయిదుగురు వైకాపా ఎమ్మెల్యేలు సభలో అనుచితంగా ప్రవర్తించినట్లు క్రమశిక్షణ చర్యలకు అర్హులైనట్లు గుర్తించారు. ఆ అయిదుగురి గురించే మండలి బుద్ధ ప్రసాద్ కమిటీ కూడా చర్చించింది. ప్రివిలేజ్ కమిటీ కూడా చర్యలు తీసుకున్నది. అయితే నలుగురు మాత్రం ఎలాంటి చర్య/ వేటు లేకుండా సునాయాసంగా తప్పించుకున్నారు. రోజా మీద మాత్రం చాలా తీవ్రంగా ఏడాదిరోజుల సస్పెన్షన్ వేటు పడింది. ఇంత తీవ్రమైన చర్య ఒక్క రోజా మీదనే ఎందుకు పడింది.. వారికి ఆమెకు మధ్య తేడా ఏమిటి? అని చూస్తే.. కేవలం ‘క్షమాపణ చెప్పడానికి’ రోజా మెట్టు దిగకపోవడమే అని ఎవ్వరికైనా అర్థమవుతుంది. ఇప్పుడంటే ఎమ్మెల్యే అనిత సభలో తనని అవమానించారు గనుక.. సభాముఖంగానే క్షమాపణ కావాలని అడుగుతున్నారు గానీ.. గొడవ జరిగిన రోజునే తర్వాత విడిగా కలిసి ‘సారీ’ చెప్పి ఉన్నా ఇంత రాద్ధాంతం జరిగేది కాదేమో. అయితే రోజా ద్వారా అలాంటి చర్య జరిగేలా పార్టీ నాయకుడు జగన్ చొరవ తీసుకోలేదని కూడా కొందరు అంటున్నారు. ఈ విషయంలో రోజా తిరిగి సభలోకి ప్రవేశించగలిగేలా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదనే వాదన ఆ పార్టీలోనే వినిపిస్తోంది. అదే సమయంలో.. అలా ఆమె ప్రవేశం పొందకుండా చూడడమే జగన్ వ్యూహం అని కూడా పార్టీలో కొందరు వాదిస్తున్నారు.
రోజా మీద ప్రభుత్వ వేధింపులు ఎంత ఎక్కువగా ఉన్నట్లు నిరూపిస్తే.. అంత ఎక్కువగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుభూతి మైలేజీ వస్తుందని జగన్ అంచనా వేస్తున్నట్లుగా సొంత పార్టీలోనే కొందరు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రోజా శాసనసభ ఎదుట ప్లాట్ఫారం మీద కూర్చుని, పడుకుని, సొమ్మసిల్లిపోయి, అట్నుంచి అటు నిమ్స్‌లో జాయిన్ అయిపోయి.. రకరకాలుగా కష్టాలు పడడం వల్ల.. ప్రజల్లో కూడా సానుభూతి లభించిందనే చెప్పాలి.
రోజాను తిరిగి సభలోకి అనుమతించకుండా.. సస్పెన్షన్ ఏడాదిపాటు కొనసాగిస్తే గనుక.. పార్టీకి ఎక్కువ మైలేజీ వస్తుందని, ప్రభుత్వాన్ని తిట్టిపోయడానికి ఏడాది పాటు ‘ఫుల్ కంటెంట్’ దొరుకుతుందని జగన్ అనుకుంటున్నారని కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్ట్రాటజీ బాగానే కనిపిస్తున్నది కానీ.. ఆచరణలో ఏమైనా బెడిసికొట్టి, బ్యాక్‌ఫైర్ కాకుండా కూడా వైకాపా అధినేత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.