ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతామనే దగ్గర్నుంచి .. విజయవాడ వెళ్లి ఆఫీసు తెరుస్తామనే ప్రకటన వరకూ.. ఏపీలో రాజకీయాల విషయంలో టీఆర్ఎస్ చాలా దూకుడుగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు బ్యాక్ ఫుట్ వేసినట్లుగా.. ఆ పార్టీ ముఖ్య నేతల ప్రకటనలు ఉంటున్నాయి. ఏపీలో రాజకీయాలు చేయాలంటే.. ఏపీలో అడుగు పెట్టాల్సిన పని లేదంటూ కేసీఆర్ కొత్తగా చెప్పుకొచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ రాజకీయాలపై… కాస్తే తేడాగా స్పందించారు. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతాము కానీ.. అది నేరుగా కాదన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఏపీలో రాజకీయాలు చేయాడనికి అక్కడ అడుగు పెట్టాల్సిన పని లేదంటున్నారు. అదే సమయంలో.. చంద్రబాబును బూచిగా చూపెట్టి తాము ఎన్నికల్లో గెలవలేదన్న ప్రచారాన్ని ప్రారంభించారు. చంద్రబాబు రాక వల్ల మేం గెలిచామనడం అపోహేనని చెబుతున్నారు చంద్రబాబు తెలంగాణకు రాక ముందే ప్రజలు తమకు ఓటేయాలని డిసైడ్ అయ్యారని చెప్పుకొస్తున్నారు.
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ ప్రటన చేసిన తర్వాత రాజకీయ పరిస్థితి మారిపోయింది. ఫెడరల్ ఫ్రంట్ టూర్లు విశాఖ నుంచే ప్రారంభించడంతో.. ఆయన ఏపీలో అడుగు పెట్టినట్లయింది. అయితే.. అక్కడ ఎలాంటి రాజకీయాలు చేయలేదు. కానీ.. ఫెడరల్ ఫ్రంట్ టూర్ ముగిసిన తర్వాత .. తనకు ఏపీలో .. విశేషమైన ప్రజాదరణ ఉన్నదని.. విశాఖ ఎయిర్ పోర్టులో వేల మంది స్వాగతం చెప్పారని.. కేసీఆర్ ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ఫెయిలయ్యాయని తాము రంగంలోకి దిగుతామని ప్రకటించారు. దీంతో నేరుగా.. కేసీఆర్ ఏపీలో అడుగు పెట్టబోతున్నారని… టీఆర్ఎస్ ప్రత్యక్షంగా.. టీడీపీ తెలంగాణలో పోటీ చేసినట్లుగా పోటీ చేయబోతోందన్న ప్రచారం జరిగింది. కానీ.. కేటీఆర్ మాత్రం.. అక్కడి రాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు.
కేటీఆర్.. ఏపీలో అడుగు పెట్టకుండానే.. ఏపీలో రాజకీయాలు చేస్తామంటున్నారు కాబట్టి.. బహుశా.. తెలుగుదేశం పార్టీని ఓడించడానికి.. ప్రత్యర్థి పార్టీలకు సహకారం అందించే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు చేసినట్లుగా ఏపీలో కూడా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్, పవన్ లను కలపాలనే దిశగా.. కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. బహుశా.. కేటీఆర్ చెప్పిన.. పరోక్ష రాజకీయం అదే అయ్యే అవకాసం ఉంది.