కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజుల నుంచి చేరిక గురించి చర్చ జరుగుతోంది. మేడ్చల్‌లో జరగబోయే సభలో.. పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని చెప్పుకొస్తున్నారు. ఢిల్లీలో రాహుల్‌ను కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి… సోనియా, రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతారు. మరి కొంతమంది టి ఆర్ ఎస్ నాయకులు కూడా హస్తం పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. వారెవరు.. వారు ఏ స్థాయి నాయకులన్నదానిపై.. విస్తృతమైన చర్చ జరుగుతోంది. మేడ్చల్ బహిరంగ సభలోనే కాంగ్రెస్, కూటమికి చెందిన కనీస ఉమ్మడి ప్రణాళిక ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మేడ్చెల్ సభలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు టి ఆర్ ఎస్ ను, కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేయనున్నారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాని ఇచ్చామో ఆ ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కర్ వైఫల్యం చెందిందని సోనియాగాంధి కేసీఆర్ సర్కార్ ను విమర్శించనున్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకవస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలను నెరవేర్చి,పేద,బడుగు బలహీన వర్గాలకు హస్తం పార్టీ అండగా నిలుస్తుందని సోనియాగాంధీ మేడ్చెల్ సభలో భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. 40 మంది స్టార్ క్యాంపైనర్లతో కూడిన జాబితా విడుదల చేసింది. కేంద్ర మాజీ మంత్రులు, సినీ నటులు, క్రీడా కారులు, ఏఐసీసీ నేతలు, ఇతర రాష్ట్రాల నేతలు ఈ 15 రోజుల కాలములో రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తారు. 10 ఉమ్మడి జిల్లాల్లో 10 భారీ ప్రచార సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
అందులో భాగంగా మేడ్చల్ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పాల్గొంటుండగా మిగిలిన 9సభల్లో రాహుల్ గాంధీ, కూటమి పార్టీల నేతలు పాల్గొంటారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మొదటి సభ కావడం, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ పాల్గొంటుండడంతో పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులను పార్టీ సమాయత్తం చేస్తోంది. సోనియా గాంధీ ప్రచారసభ… తెలంగాణ ఎన్నికల వేడిని మరింత పెంచనుంది. సోనియా సభకు కూటమి నేతలందరూ హాజరవుతున్నారు. కోదండారం. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు.. 119 నియోజకవర్గాల ప్రజాకూటమి అభ్యర్థులందరూ హాజరవనున్నారు.