రైతుల కోసం అవసరం అయితే రాజీనామా చేస్తామంటూ టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ , ఎంపీ కే.కేశవరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయన ఆ మాటలు ఊరకనే అని ఉండరని..ఎదో వ్యూహంతోనే అని ఉంటారన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునే దిశలో రైతుల కోసం అవసరం అయితే పదవులు కూడా వదులుకుంటామని సంకేతం పంపేందుకు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం రాజ్యసభలో టీఆర్ఎస్కు ఏడుగురు సభ్యులున్నారు. ఒకరు డీఎస్. ఆయన టీఆర్ఎస్కు దూరంగా ఉన్నారు. మరొకరు రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యారు. అంటే ఐదుగురు మాత్రమే టీఆర్ఎస్కు ఉన్నట్లు. రైతుల కోసం.. తాము పదవులు వదులుకునే ఆలోచనలో ఉన్నామని కేకే చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్.. ఉద్యమ కార్యాచరణను త్వరలో ఖరారు చేసుకుంటామని ప్రకటించారు. ఆ తదుపరి కార్యాచరణ రాజీనామానేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో తెలంగాణ కోసం రాజీనామా లు చేశామని ఇప్పుడు రైతుల కోసం రాజీనామాలు చేస్తామన్నట్లుగా ఎంపీలు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రాజ్యసభ సభ్యులతోనే రాజీనామాలు చేయిస్తారన్న అంశం హైలెట్ అవుతోంది. రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసినా మళ్లీ ఆ స్థానాలన్నీ టీఆర్ఎస్సే గెలుస్తుంది. దానికి తగ్గట్లుగా ఎమ్మెల్యేల బలం ఉంది. రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి లోక్ సభ ఎంపీలు చేయకపోతే టీఆర్ఎస్ అంతా పొలిటికల్ గేమ్ అడుతుందని ప్రజలు కూడా భావించే పరిస్థితి వస్తుంది.
కేసీఆర్ రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టం. కేకే మాట వరుసకు పదవులు వదులుకుంటామని అన్నారో లేక .. రాజీనామాల వ్యూహం ఉందో ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.