తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోరాడడంలో మడమ తిప్పకుండా దృఢ వైఖరి అనుసరిస్తున్నాం అని తమలో తామే మురిసిపోతూ ఉండే టీపీసీసీ నాయకులు ఒకే పోకడను వేర్వేరు నాయకుల విషయంలో అనుసరించగలరా? పార్టీలో నాయకులకు ఉన్న కరిష్మా, బలాబలాలను బట్టి వారి మీద చర్యలు తీసుకుంటారా? లేదా… వారు చేసిన తప్పులను బట్టి చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకోవడంలో కుల పరమైన లేదా స్థాయీపరమైన భేదాలను పాటిస్తారా? అనేది ఇప్పుడు తేలిపోనుంది. ఒక తప్పును ఒక నాయకుడు చేస్తే నోటీసులు ఇచ్చి గుడ్లురిమిన టీపీసీసీ నాయకత్వం అదే తప్పును మరో వర్గానికిచెందిన మరో సీనియర్ నాయకుడు చేస్తే.. ఏం చేయబోతున్నదో అనే చర్చ పార్టీలో నడుస్తోంది.
కేసీఆర్ తమ గులాబీ పార్టీలోకి ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని చేర్చుకోవడం మీద మాత్రమే దృష్టిపెడుతున్నారు. మామూలు నాయకులను కూడా చేర్చుకోవడంపై ఆకర్ష పథకం పెడితే మిగిలిన పార్టీల పరిస్థితి ఎలా మారేదో అంచనా వేయలేం. అయితే.. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న దూకుడు, బలోపేతం అవుతున్న తీరుచూసి, ఆ పార్టీలోకి వెళ్లిపోతే బాగుంటుందని చాలామంది కాంగ్రెస్, తెదేపా నేతలు భావిస్తున్న మాట అబద్ధం కాదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు తీసుకునే మంచి నిర్ణయాలను అభినందించడానికి వారు వెనుకాడడం లేదు కూడా! అయితే టీపీసీసీ నాయకులు మాత్రం సహజంగానే దీనిని సహించలేకపోతున్నారు.
మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కేసీఆర్ నిర్ణయించడంపై పీసీసీ అధికార ప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆయనను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు. దీనికి పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశారంటూ విమర్శించింది. తాను బీసీ నేతను గనుక.. వెంటపడి నోటీసులు ఇస్తున్నారంటూ ఆయన రచ్చకెక్కారు కూడా!
అయితే ఇప్పుడు కేసీఆర్‌ను కీర్తించే బాధ్యతను సీనియర్‌నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్నారు. కేసీఆర్ జలదృశ్యం ప్రదర్శనను పార్టీ మొత్తం బహిష్కరించి, విమర్శిస్తూ ఉంటే.. ఈ ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉన్నదంటూ కోమటిరెడ్డి కీర్తిస్తున్నారు. ఇది చాలా బాగుందని అంటూనే… ఇవన్నీ కార్యరూపంలోకి వస్తే చాలా బాగుంటుందని ఆయన అన్నారు. అలాగే కేసీఆర్ డబుల్బెడ్రూం ఇళ్ల పథకాన్ని కూడా కీర్తిస్తూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం విశేషం. హైదరాబాదులో లక్ష, ప్రతి పల్లెలో 50 ఇళ్లు కడితే గనుక.. కేసీఆర్‌కు ఓటేయాల్సిందిగా తానే చెబుతా అంటూ సెలవిచ్చారు. ఒక రకంగా ఇది సవాలులాగా కనిపించవచ్చు గానీ.. ప్రాథమికంగా కేసీఆర్‌ను ఆయన భయంకరంగా పొగిడారనేది వాస్తవం.
గతంలో, ఒక దశలో కోమటిరెడ్డి బ్రదర్స్ గులాబీ తీర్థం పుచ్చుకునే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ పుకార్లు ఆగిపోయాయి. తాజాగా ఆ పుకార్లకు మళ్లీ ప్రాణం రావచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో చర్చ ఏంటంటే.. కేసీఆర్‌ను కీర్తించినందుకు బీసీ నేతకు షోకాజు నోటీసులు ఇచ్చారు సరే, అదే పనిచేసిన రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చే సత్తా టీపీసీసీ నాయకత్వానికి ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి, కేసీఆర్‌ను తమ పార్టీలోని ఎవ్వరు పాజిటివ్‌గా చూసినా సహించలేకపోతున్న ఉత్తమకుమార్‌రెడ్డి అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి.