తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి… తెలుగుదేశం పార్టీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్! టీటీడీ ఛైర్మన్ పదవి తమకే ఇవ్వాలంటూ పలువురు ప్రముఖ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. ఈ కుర్చీ కోసం కుస్తీలు పడుతున్నవారిలో ప్రముఖంగా వినిస్తున్న పేర్లు… ఎంపీ రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్. ఇవాళ్లో రేపో దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ పదవి ఇద్దరిలో ఎవరికి కట్టబెడతారు అనే అంశంపై టీడీపీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.
ఇంతకీ చంద్రబాబు మనసులో ఎవరున్నారంటే… ఎంపీ మురళీ మోహన్ అని అంటున్నారు! ఎందుకంటే, మురళీ మోహన్ తో చంద్రబాబుకు ఉన్న ‘ప్రత్యేక’ అనుబంధం తెలిసిందే కదా. సో.. ఆ ప్రాతిపదికన మురళీమోహన్ పేరును ఖరారు చెయ్యొచ్చు అంటూ టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ సంకేతాలను రాయపాటి వర్గం కాస్త సీరియస్ గానే తీసుకుంటోందట! మురళీ మోహన్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారన్న సమాచారంపై వీరు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే, ముఖ్యమంత్రికి ఎన్నో సందర్భాల్లో ఎంతగానో సాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్న రాయపాటిని కాదని, వేరే నాయకుడికి ఎలా అవకాశం ఇస్తారనే వాదన వినిపిస్తున్నారు.
రాయపాటి అయితేనే అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉంటారనీ, అదే మురళీ మోహన్ అయితే ఒక్క సినీ ప్రముఖులకు తప్ప ఆయన మిగతావారితో కలుపుగోలుగా ఉన్న సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయంటూ రాయపాటి వర్గీలు అంటున్నారట! అంతేకాదు.. టీటీడీ ఛైర్మన్ పదవిపై రాయపాటి కూడా చాలా ఆశలుపెట్టుకున్నట్టు సమాచారం. ఒకవేళ పదవి తనకు దక్కకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి, పార్టీకి దూరంగా ఉంటానని సన్నిహితుల వద్ద ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినట్టు కూడా ఓ ప్రచారం జరుగుతోంది.
పోలవరం ప్రాజెక్టు పనుల్ని దక్కించుకున్నది రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీయే. కానీ, ఆ పనుల్ని దగ్గరుండి చూసుకుంటున్నది సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పట్ల అంత కృతజ్ఞత ప్రదర్శిస్తున్న రాయాపాటికే ఈ పదవి దక్కాలంటూ ఆ వర్గం బలమైన వాదన వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిజానికి… మురళీ మోహన్, రాయపాటి సాంబశివరావు ఈ ఇద్దరూ చంద్రబాబుకు ఎంతో కావాల్సినవారే అనడంలో సందేహం లేదు. అలాంటప్పుడు ఈ ఇద్దరూ పోటీ పడుతున్న ఛైర్మన్ పదవి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటానేది వేచి చూడాలి.