ఎన్నికల్లో పోటీకి సిద్ధమై.. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేరు నుంచి పోటీ చేస్తానంటున్న తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్ విజయవంతంగా బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ స్థానానికి ఒప్పుకునేలా చేశారంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ ఖరారు చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్గ పోరు ఆ పార్టీకి సమస్యగా మారింది.
ఖమ్మం పార్టీలో నేతలు ఎక్కువయ్యారు. సీట్లు తక్కువయ్యాయి. పైగా లెఫ్ట్ పార్టీల పొత్తు ఉంది. దీంతో కొంత మంది నేతలకు సర్దుబాటు చేయాల్సిన పరిస్థి ఏర్పడింది. ఇప్పటికే పొంగులేటి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన ఏ పార్టీలో చేరుతారో తెలీదు కానీ బీఆర్ఎస్ లో మాత్రం ఉండరు. ఇక తుమ్మల కూడా వెళ్లిపోతే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు మరోసారి గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే కేసీఆర్.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ముందస్తు హామీ ప్రకారం టిక్కెట్ ఇవ్వాలి కాబట్టి ఎమ్మెల్సీ తీసుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది.
ఇంత కాలం ఎమ్మెల్సీ ఇస్తారని ఎదురు చూసిన తుమ్మల.. కనీసం ఎన్నికలకు ముందు అయినా గుర్తించారు చాలన్నట్లుగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై తుమ్మల అనుచరులు ఎలా స్పందిస్తారో కానీ..ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తుమ్మల వైదొలగడం మాత్రం… ఖమ్మం రాజకీయాల్లో కీలకం కానుంది.