పార్టీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారు.. వచ్చే వారు లేరు.. ఖాళీగా ఉన్న వారినైనా చేర్చుకోవాలని జగన్ అనుకుంటున్నారేమో కానీ పార్టీలో వారు చేరుతారు.. వీరు చేరుతారు అని వృద్ధ నేతల గురించి ప్రచారం చేసేసుకుటున్నారు. శైలజానాథ్ పార్టీలో చేరిక తర్వాత .. ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతారన్న ప్రచారం చేస్తున్నారు. ఆయన రేపో మాపో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం ఖండించలేదు.
కాంగ్రెస్ పార్టీలో పదవి అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి నడిచిన ఆయన ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. తాను రాజకీయాల్లో లేనని కానీ రాజకీయాల గురించి మాత్రం మాట్లాడతానని చెప్పుకుంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రివర్స్ లో జగన్ కోసం సలహాలిచ్చేందుకు ఆయన గొప్పగా పాలిస్తున్నాడని చెప్పేందుకు చాలా సార్లు మీడియా ముందుకు వచ్చారు. అదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్స్ తెచ్చి అదేదో చంద్రబాబుకు ఆదాయం వెళ్తుందన్నట్లుగా తప్పుడు ప్రచారం చేసేవారు. అదే జగన్ చేసిన మద్యం వ్యాపారంపై మాత్రం ఎప్పుడూ మాట్లాడలేదు.
పవన్ కు శ్రేయోభిలాషిలాగా కబుర్లు చెప్పే ఆయన ఇప్పుడు ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి వైసీపీలో చేరితే.. ఆయన మేధావితనం అంతా తలకిందులు అవుతుంది. ఆయన క్యారెక్టర్ ను తక్కువే చేసేవారు ఎక్కువ అవుతారు. అయితే జగన్ కోసం ఆయన ఏమైనా చేస్తా అనే టైపులో ఇంత కాలం న్యూట్రల్ ముసుగులోనే పనులు చక్కబెట్టారు కాబట్టి ఇప్పుడు వైసీపీలో చేరినా పోయేదేమీ ఉండదని ఆయన అనుకుంటే జగన్ తో కండువా కప్పుకోవచ్చు. అసలే ఇప్పుడు వైసీపీ తరపున మాట్లాడేందుకు అంబటి రాంబాబు తప్ప మరొకరు కనిపించడం లేదు.