తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఇప్పుడు ఆయన భవిష్యత్తు ఏంటనే చర్చ మొదలౌతుంది. ఎందుకంటే, ఆయన పీసీసీ బాధ్యతల నుంచి ఎప్పుడో తప్పుకోవాలి, కాలపరిమితి కూడా ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఖాళీ చేస్తే చాలు అని ఎదురుచూస్తున్న నాయకులూ ఆ పార్టీలో చాలామంది ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచాక… హుజూర్ నగర్ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి, పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల్ని ఎదుర్కొంటేనే పార్టీకి ప్లస్ అవుతుందనే కారణాన్ని హైకమాండ్ కి చెప్పి మరీ కొనసాగింపు తెచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు హుజూర్ నగర్లో పార్టీ ఘోర పరాజయం. స్థానికంగా విశ్లేషణలు ఎలా ఉన్నా… వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఎందుకు ఓడిపోయారనేది హైకమాండ్ సీరియస్ గానే తీసుకుంటుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక వైఫల్యంతో పార్టీలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకులు స్వరం పెంచే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అదేదో బయటపడేలోగానే నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది.
గడచిన ఐదేళ్లుగా ఆయనే పీసీసీ అధ్యక్షుడిగానే ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది..ఓడిపోయింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆయన నాయకత్వంలోనే పార్టీ ముందుకెళ్లినా…. సాధించిన ఆ కొన్ని స్థానాలనూ విజయంగా చెప్పుకోలేని పరిస్థితి. ఇక, రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ లను కూడా కాంగ్రెస్ కోల్పోయింది. ఇప్పుడు ఉప ఎన్నికలో ఓటమి! అంటే, పీసీసీ అధ్యక్షుడిగా ఒక్కటంటే ఒక్క ఎన్నికలో కూడా విజయం వైపు కాదుకదా… కనీసం గట్టి పోటీని ఇచ్చే విధంగా పార్టీని నడిపించలేకపోయారు అనేది స్పష్టంగా కనిపిస్తున్నది.
సొంత నియోజక వర్గంలో తెరాసతో హోరాహోరీ పోటీ ఇచ్చినా కొంత మర్యాద దక్కేది. కానీ, అలాంటి పరిస్థితే కనిపించలేదు. ఇదంతా ఉత్తమ్ నాయకత్వ లోపం అనే చర్చ కచ్చితంగా మొదలౌతుంది. ఈ చర్చంతా జరిగి, సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చే కంటే ముందుగానే ఉత్తమ్ రాజీనామాపై ప్రకటన చేసే అవకాశం ఉందనీ, అలా చేస్తేనే కొంత మర్యాదగా హుందాగా ఉంటుందనే అభిప్రాయంతో ఆయన ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.