వకీల్ సాబ్ తరవాత.. పవన్ కల్యాణ్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు. పవన్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు దిల్ రాజుకి కావల్సింది… ఓ కథ, దర్శకుడు. దిల్ రాజు తలచుకుంటే, కథలకు, దర్శకులకూ లోటు లేదు. తన కాంపౌండ్ లోనే చాలామంది దర్శకులున్నారు. ఇప్పుడు వాళ్లలో ఒకరిని ఈ పని మీద దిల్ రాజు పురమాయించినట్టు తెలుస్తోంది. తనే.. వంశీ పైడిపల్లి.
వంశీ సినిమాలు (ఊపిరి మినహా) అన్నీ.. దిల్ రాజు బ్యానర్లోనే. ఇప్పుడు కూడా ఓ కథ పట్టుకుని హీరో కోసం అన్వేషిస్తున్నాడు. అన్నీ కుదిరితే.. దిల్ రాజు బ్యానర్లోనే ఆ సినిమా ఉంటుంది. అయితే.. ఇప్పుడు పవన్‌తో రెండో సినిమా ఓకే అనిపించుకున్న దిల్ రాజు, ఆ బాధ్యతని వంశీ పైడిపల్లికి అప్పగించినట్టు టాక్. దిల్ రాజు తొలి ఆప్షన్.. వంశీనే. తను కథ సెట్ చేయకపోతే, అప్పుడు మరో దర్శకుడ్ని వెదుక్కుంటాడు. ఆమధ్య `హర హర వీరమల్లు` షూటింగ్ లో దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఇద్దరూ పవన్ ని కలిసొచ్చారు. ఆ సమయంలోనే ఈ సినిమా గురించిన చర్చలు జరిగినట్టు సమాచారం.