వంగవీటి రాధాకృష్ణ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ హైకమాండ్ అడిగినా ఆయనపెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే హఠాత్తుగా జనసేన నేతలతో భేటీ అవుతున్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ తో తర్వాత మచిలీపట్నం అభ్యర్థి బాలశౌరితో సమావేశం అయ్యారు. ఆయన ఉద్దేశం ఏమిటో బయటకు తెలియడం లేదు కానీ…. ఎన్నికల్లో పోటీకి మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. ఆ నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. టీడీపీ నేత మండలి బుద్దప్రసాద్ ను జనసేన తరపున పోటీ చేయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అదే సమయంలో వంగవీటి రాధాకృష్ణ కూడా అవనిగడ్డపై ఆసక్తి చూపిస్తున్నారని.. జనసేన తరపున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆయన పోటీ చేస్తానంటే.. ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు.
అయితే వంగవీటి ఎన్నికల్లో పోటీపై ఎలాంటి ఆలోచనతో ఉన్నారో క్లారిటీ లేదు. అభ్యర్థుల ఖరారు సమయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టినప్పటికీ ఆసక్తి చూపించలేదని టీడీపీ నేతలంటున్నారు. ఇప్పుడు అవనిగడ్డలోనూ పోటీపై జరుగుతోందన్నది ప్రచారమేనని వంగవీటి వర్గీయులు అంటున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వడానికి కూడా వైసీపీ రాయబారం నడిపినా ఆయన అంగీకరించలేదని గుర్తు చేస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి తరపున వంగవీటి రాధా విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేశారు.