ప్రణయ్ – అమృతల ప్రణయగాథని తెలుగు ప్రజలు ఇప్పట్లో మర్చిపోలేరు. ఓ తండ్రిగా మారుతీరావు కరెక్టా? ఓ కూతురిగా అమృత నిర్ణయం సరైనదా? అనేది ఎడతెగని డిబేట్. తండ్రి స్థానంలో ఉన్నవాళ్లంతా మారుతీరావుని సమర్థించొచ్చు గాక. కానీ మానవత్వం గురించి మాట్లాడేవాళ్లంతా అమృత పక్కన నిలబడాల్సిందే. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ని వర్మ మరోసారి గుర్తు చేయబోతున్నాడు. `మర్డర్` తో. ఇది అమృత- ప్రణయ్ -మారుతిల కథే. ఏటీటీ కోసం వర్మ రూపొందించిన మరో సినిమా ఇది. త్వరలోనే విడుదల కాబోతోంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.
ట్రైలర్ చూస్తే.. వర్మ మారుతీరావుకి వకాల్తా పుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. పిల్లల్ని ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపడం తప్పా? అనే ప్రశ్నలు లేవనెత్తడం చూస్తుంటే… కచ్చితంగా `మర్డర్` ఒరిగేది మారుతీరావు వైపే అనేది స్పష్టం అవుతుంది. కూతురు ఎవరితోనో వెళ్లిపోతే.. ఓ తండ్రి పడే ఆవేదనని ఈ సినిమాతో వర్మ తెరపైకెక్కించాడన్నది తెలుస్తోంది. వర్మ శిష్యుడు ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాపై అమృత కూడా ఇది వరకు తిరగబడింది. మానుతున్న గాయాన్ని మళ్లీ రేపి, సొమ్ము చేసుకుంటున్నావ్.. అంటూ.. వర్మపై గట్టిగానే కౌంటర్లు వేసింది. ఈ ట్రైలర్ చూశాక ఇంకేం అంటుందో?