చిత్రసీమలో విజయానికే విలువ. ఎంత ప్రతిభ ఉన్నా… ఫ్లాపులు తగులుతుంటే ఎవ్వరూ పట్టించుకోరు. శ్రీనువైట్ల టాలెంట్ గురించి ఎవ్వరూ శంకించాల్సిన అవసరం లేదు. వినోదానికి వినోదం, యాక్షన్‌కి యాక్షన్ దట్టించి సినిమాలు తీయడంలో ఆయన స్పెషలిస్టు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఆయనకు హిట్లు పడలేదు. ఆగడు లాంటి డిజాస్టర్ ఆయన్ని బాగా దెబ్బకొట్టింది. బ్రూస్లీతో కాన్ఫిడెన్స్ అంతా పోయింది. అవన్నీ మిస్టర్ తో తిరిగి రాబట్టుకొనే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ఈ సినిమా కోసం పారితోషికం బాగా తగ్గించుకొన్నాడు. తన స్టైల్ కూడా పూర్తిగా మార్చుకొన్నాడు. మొన్నటి వరకూ దూరంగా పెట్టిన మీడియాకు… మళ్లీ ఫోన్లు చేసి మచ్చిక చేసుకొనే ప్రయత్నాలు కూడా చేశాడు. ఇంతలా మారినా… సినిమా హిట్టవ్వకపోతే ఉపయోగం ఉండదు. అందుకే… శ్రీనువైట్లకు క్షణం ఒక యుగంలా గడుస్తుందిప్పుడు. ‘మిస్టర్’ హిట్ టాక్ వచ్చేంత వరకూ.. ఆయన మనసు కుదుటపడదు.
మరోవైపు వరుణ్‌తేజ్ పరిస్థితీ అంతే. కుర్రాడికి మంచి సినిమాలే పడుతున్నాయి. తాను బాగానే చేస్తున్నాడు. కానీ… ‘హిట్’ అందడం లేదు. ముకుందా సరిగా ఆడలేదు. కంచె మంచి సినిమానే గానీ, డబ్బులు తీసుకురాలేదు. లోఫర్ ఫ్లాప్ అయ్యింది. ఈ దశలో శ్రీనువైట్లతో సినిమా అనేది కాస్త రిస్కే. కానీ.. ధైర్యంగా చేసేశాడు. ఈ సినిమా అటూ ఇటూ అయితే… అది వరుణ్ కెరీర్‌ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి `మిస్టర్` ఫలితం వరుణ్‌కీ కీలకమే. నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్లకూ ఓ హిట్టు పడాలి. వీళ్ల గత చిత్రం `విన్నర్` భారీ నష్టాల్ని మిగిల్చింది. వాటిని పూడ్చుకోవాలంటే.. ‘మిస్టర్’ తో గట్టెక్కాల్సిందే. ఓ సినిమా అటు హీరో, ఇటు దర్శకుడు, మధ్యలో నిర్మాతలకూ కీలకం కావడం ఈమధ్య కాలంలో ఇదేనేమో. ఒక్కసినిమా ఈ నలుగురి జాతకాల్ని మారుస్తుందా?? మళ్లీ ఏమారుస్తుందా? వెయిట్ అండ్ సీ.