రాష్ట్రపతి పదవికి ఈ సారి దక్షిణాది నేతను ఎంపిక చేయాలన్న ఉద్దేశంలో ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల నేతల గుణాగుణాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు దక్షిణాది నుంచికీలక పాత్రలో ఉన్నారు. ఆయన రాష్ట్రపతి పదవికి సరైన స్టేచర్ ఉన్న నాయకుడు. ప్రజల్లో గుర్తింపు.. బీజేపీకి విధేయత ఇలా ఏ విధంగా చూసినా సరిపోతారు. కానీ ప్రధానమంత్రి మోడీ మాత్రం వెంకయ్యనాయుడు పేరును ఎక్కుగా పరిశీలించడం లేదు. ఇతర పేర్లనూ పరిశీలిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిశై పేరును కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
దేశంలో రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నత పదవులు .. బీజేపీ వచ్చిన తర్వాత ఉత్తరాది వారికే లభిస్తున్నాయి. దక్షిణాదికి పెద్దగా ప్రాదాన్యం లభించడం లేదు. ఈ క్రమంలో దక్షిణాదిని పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది. దీన్ని తగ్గించడానికి ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. జూన్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉంది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. దీంతో పోటీ అనివార్యమని అనుకోవచ్చు. అందుకే దక్షిణాది నుంచి కాస్త స్టేచర్ ఉన్న నాయకుడి కోసం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
దక్షిణాదిలో బీజేపీకి పెద్దగా గుర్తింపు ఉన్న నేతల కొరత ఎక్కువగా ఉంది. కర్ణాటక నుంచి యడ్యూరప్ప ఉన్నారు కానీ ఆయనపై ఉన్న అవినీతి మరకల కారణంగా పరిశీలించడం లేదు. బీజేపీ బయట నుంచి ఎవరినైనా ఎంపిక చేద్దామా.. అని వివిధ రంగాల్లో స్థిరపడిన ప్రముఖుల పేర్లనూ పరిశీలిస్తున్నారు. ఇప్పటికైతే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఓ దక్షిణాది నేతకూ చాన్సివ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. చివరిగా అభ్యర్థిని ఖరారు చేసే టప్పటికి.,. ఏం చేస్తారో కానీ ఇప్పటికైతే దక్షిణాదికి న్యాయం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.