తమిళనాట డీఎంకేను పడగొట్టాలంటే పొత్తులు తప్పనిసరి అని విజయ్ ను ప్రశాంత్ కిషోర్ ఒప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఫార్ములా ఏంటో బయటకు లీక్ అయినట్లుగా తమిళనాడులో గుప్పుమంటోంది. ఆ ఫార్ములా ఏమిటంటే.. టీవీకే అధ్యక్షుడు విజయ్ ఉపముఖ్యమంత్రిగా… అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారట. ఈ విషయంపై తమిళనాడు రాజకీయాల్లో గగ్గోలు రేగుతోంది.
పళని స్వామి మాస్ లీడర్ కాదు. విజయ్ పూర్తి స్థాయి మాస్ లీడర్ అనుకోవచ్చు. ప్రతి ఊళ్లో ఆయనకు అభిమాన సంఘం ఉంటుంది. ఆయనను ఉపముఖ్యమంత్రిగా ఎవరూ ఊహించుకోలేరు. అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ను చూపించి ప్రశాంత్ కిషోర్ ఆయనను ఉపముఖ్యమంత్రి ప్రతిపాదనకు అంగీకరించినట్లుగా చెబుతున్నారు. కానీ ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
అన్నాడీఎంకే తమిళనాడులో బలంగానే ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు కానీ కోర్ ఓట్ బ్యాంక్ మాత్రం చెక్కుచెదరలేదని తెలుస్తోంది. అయితే ఆ ఓటర్లు అంతా డీఎంకేను వ్యతిరేకించేవారే.. ప్రత్యామ్నాయం లేకనే అన్నాడీఎంకేతో ఉన్నారని.. విజయ్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తే వారితో ఆ ఓటర్లంతా వెళ్తారన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే సీనియర్ నేతలు విజయ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు.
పీకే విజయ్ ను ఉపముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన విషయం నిజమే అయితే.. టీవీకే అధ్యక్షుడు స్పందన ఏమిటన్నది ఆసక్తికరం. ఆయన ఒప్పుకునే అవకాశం లేదని.. ఎవరికో డిప్యూటీగా ఉండేందుకు ఆయన రాజకీయాల్లోకి రాలేదని చెబుతారని భావిస్తున్నారు. పొత్తులు ఖరారు కాకపోతే డీఎంకే విజయం నల్లేరుపై నడక అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.