‘మనీ హేస్ట్’ మామూలు వెబ్ సిరిస్ కాదు. ‘మనీ హేస్ట్’ చూస్తే ఇంకో వెబ్ సిరిస్ కనెక్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది. అంత ఇంపాక్ట్ కలిగించే వెబ్ సిరిస్ ఇది. కిడ్నాప్, రాబరీ సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ ‘మనీ హేస్ట్’ కిక్కే వేరు. ‘మనీ హేస్ట్’ చూసిన తర్వాత చాలా మంది దర్శకులు ఆ ఫార్ముల కథలు రాసుకున్నారు. మొన్న విడుదలైన ‘ఏ థర్స్ డే’ సినిమా ఫ్రార్ములా కూడా ‘మనీ హేస్ట్’లోదే. ఇప్పుడు ‘మనీ హేస్ట్’ ఫార్ములాతో మరో పెద్ద సినిమా వస్తుంది. అదే విజయ్ బీస్ట్.
కోలమావు కోకిల, డాక్టర్ వరుణ్ లాంటి సూపర్ హిట్లు తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు ‘మనీ హేస్ట్’ ఫార్ముల కళ్ళముందు కదిలింది. ఓ గ్యాంగ్ ఒక పెద్ద షాపింగ్ మాల్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటుంది. అప్పటివరకూ షాపింగ్ మాల్ లో వున్నవారంతా వారికి బందీలుగా వుండిపోతారు. వీళ్ళని రక్షించడానికి ఇంటలిజెన్స్ విభాగంలో పని చేసే స్పై మిషన్ లోకి ఎంటర్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందనేది ట్రైలర్ లో కథగా చూపించారు.
ట్రైలర్ చూస్తుంటే యాక్షన్, ఫన్ మిక్స్ చేసినట్లనిపిస్తుంది. ఒక షాపింగ్ మాల్ లోనే దాదాపు సినిమాని నడిపించడం, అక్కడ వున్న బంధీలు చుట్టూ సీన్స్ అల్లుకోవడం చూస్తుంటే మనీ హేస్ట్ గుర్తురాక మానదు. అయితే ఈ చిత్ర దర్శకుడు నెల్సన్ కి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. డాక్టర్ వరుణ్ తో అందరినీ నవ్వించాడు. సీరియస్ యాక్షన్ లో కూడా కామెడీ పిండుకునే నేర్పు తెలిసిన దర్శకుడు. మొత్తానికి బీస్ట్ ట్రైలర్ సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించింది.