తమిళ స్టార్ విజయ్ సినిమాలు తెలుగులోనూ సందడి చేస్తాయి. ఆయన గత చిత్రాలు వారసుడు, లియో ఆశించిన విజయాలు సాధించనప్పటికీ రిలీజ్ కి ముందు మంచి హైప్ క్రియేట్ చేశాయి. వారసుడు నిర్మాత దిల్ రాజు. దర్శకుడు వంశీపైడిపల్లి. సరిగ్గా సంక్రాంతి బరిలో సినిమాని దించారు. సంక్రాంతికి డబ్బింగ్ సినిమా ఎందుకనే వివాదమూ నడిచింది.
ఇక లియో విషయానికి వస్తే.. లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. విక్రమ్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత లోకేష్ నుంచి వచ్చిన సినిమా ఇది. అలాగే ఆయన ఫిల్మ్ యూనివర్స్ తో లియో కథ భాగమై వుంటుందనే ప్రచారం కూడా మంచి ఊపుని తెచ్చింది.
కానీ ఇప్పుడు విజయ్ నుంచి వస్తున్న ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)పై ఇలాంటి బజ్ కనిపించడం లేదు. సినిమా విడుదల ఇంకెంతో దూరంలో లేదు. సెప్టెంబర్ 5 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టీజర్, ట్రైలర్ బావున్నాయి కానీ ఈ బజ్ సరిపోదు. దర్శకుడు వెంకట్ ప్రభు ఫామ్ లో లేరు. మానాడు తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ దెబ్బకొట్టాయి. అలా ఈ సినిమా డైరెక్టర్ క్రేజ్ కలసి రాలేదు.
ఇక ప్రమోషన్స్ తోనే హైప్ క్రియేట్ చేయాలి. తెలుగు ప్రమోషన్స్ కి విజయ్ ఎప్పుడూ రారు. గతంలో లియో రైట్స్ తీసుకున్న సితార నాగవంశీ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే విడుదలచేయాల్సి వచ్చింది. ది గోట్ తెలుగు రైట్స్ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నారు. విజయ్ ని ఇక్కడి రప్పించి కనీసం ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినా ఎంతో కొంత బజ్ వస్తుంది. నిర్మాతలు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి విజయ్ ఈసారైనా నిర్మాతల మాట వింటాడా? తెలుగు ప్రచారానికి అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి.