తిరుపతి ఉపఎన్నికల్లో 65 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే.. పదిహేనుశాతం వరకూ తక్కువ. ఇంత పెద్ద మొత్తంలో పోలింగ్ తగ్గుదల రాజకీయ పార్టీలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. హోరాహోరీగా పార్టీలు ప్రచారం చేశాయి. ఆయా పార్టీల మద్దతుదారులందర్నీ పోలింగ్‌బూత్‌ల వరకూ వచ్చేలా చేయడానికి సన్నాహాలు చేశారు. అయినప్పటీకీ.. పదిహేనుశాతం వరకూ పోలింగ్ తగ్గడం … రాజకీయపార్టీల్లో చర్చకు కారణం అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటర్లు సహజంగానే ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్నారని.. ఆయా పార్టీల సానుభూతిపరులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారని అంచనా వేస్తున్నారు.
భారీ పోలింగ్ నమోదైతే.. తమకు ఐదు లక్షల మెజార్టీ వస్తుందని వైసీపీ వర్గాలు అంచనా వేసుకున్నాయి. గతంలో నమోదైన ఓటింగ్ మేర ఉన్నా… తమకు ఆమెజార్టీ వస్తుందని అనుకున్నాయి. కానీ ఓటింగ్ అరవై ఐదు శాతానికి పరిమితమయింది. మొత్తం ఏడు నియోజకవర్గాల్లో పదిహేడు లక్షల ఓట్లలో పది లక్షల ఓట్లు పోల్ అయి ఉంటాయి. ఇందులోనే ఐదు లక్షల మెజార్టీ తెచ్చుకోవడం అంటే క్లిష్టమైన విషయమే. ఓ వైపు టీడీపీ.. జనసేన- బీజేపీ కూటామి హోరాహోరీగా పోరాడాయి. అందుకే.. ఐదు లక్షల మెజార్టీ అంశాన్ని గట్టిగా చెప్పలేకపోతున్న వైసీపీ.. గత ఎన్నికల మెజార్టీని దాటుతామని నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి.
పరిషత్ ఎన్నికల్లోనూ పోలింగ్ తక్కువ శాతం నమోదయింది. ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్దకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు తిరుపతిలోనూ అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఓట్లు వేయడానికి ఆసక్తి చూపించని పరిణామాన్ని ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మకం కోల్పోతున్న పరిస్థితిగా పరిగణించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలన్నీ ఈ అంశాన్ని సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించి.. ఓటు వేస్తేనే… భవిష్యత్ బాగుంటుందని చెప్పగలగాలి. లేకపోతే.. ఎవరు గెలిచినా ఏముందిలే అనుకుంటే మొదటికే మోసం వస్తుంది.