వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరమైన ఓటమిని చవి చూసింది. 152 సిట్టింగ్ స్థానాల నుంచి చరిత్రలో ఏ పార్టీ చూడనంత ఘోరంగా.. 9 అసెంబ్లీ స్థానాలకు పడిపోయింది. మంత్రుల్లో జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే గెలిచారు. మిగతా అందరూ పరాజయం పాలయ్యారు.
విశాఖ జిల్లాలో రెండు స్థానాలు అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయ దిశగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేసింది. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో మాత్రమే మరో రెండు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. పుంగనూరు,తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కేవలం మూడు అంటే మూడు చోట్లే ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో జగన్, బద్వేలులో దాసరి సుధ, రారజంపేటలో ఆకేపాటి ఆధిక్యంలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అంటే మొత్తంగా నాలుగు జిల్లాల్లో తొమ్మిది సీట్లు సాధించారు. మిగతా అన్ని జిల్లాల్లో ఊడ్చుకుపోయారు.
ఇక ఎంపీ సీట్లలో మూడు అంటే మూడు చోట్ల మాత్రమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప , రాజంపేట, అరకుల్లో మాత్రమే విజయావకాశాలు ఉన్నాయి. తిరుపతిలో బీజేపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అది కూడా బీజేపీ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి.