వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఎవరూ కలవొద్దని వైసీపీ హైకమాండ్ తమ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత అయిన విజయసాయిరెడ్డి ఎక్కడకు వెళ్లినా ఒంటరిగా వెళ్తున్నారు. తాజాగా ఆయన బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. విశాఖ అభివృద్ధి పనుల కోసం కలిసినట్లుగా చెబుతున్నారు. నిజానికి విశాఖలో ఇన్వెస్ట్ మెంట్స్ సదస్సు నిర్వహిస్తున్నారు. అ ప్రాంతంలో వైసీపీ తరుపున అనధికారిక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి పిలుపు లేదు.
దేశవ్యాప్తంగా ప్రముఖ పెట్టుబడిదారులతో ఆయనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే పలు రాష్ట్రాల్లో నిర్వహించిన రోడ్ షోలకు పిలువలేదు. చివరికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు వెళ్లిన టీమ్‌లోనూ… విజయసాయిరెడ్డి లేరు. ఇటీవల గవర్నర్ ను కూడా ఆయన ఒంటరిగానే కలిశారు. విజయసాయిరెడ్డి ఇలా ఒంటరిగా పార్టీ ముద్ర లేకుండా రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఢిల్లీలో వైసీపీలో ఏం జరుగుతోందన్న చర్చ జరుగుతోంది.
అదే సమయంలో విజయసాయిరెడ్డి.. పీఎం కిసాన్ పథకానికి మీట నొక్కుతున్న సమయంలో… చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. జగన్ ఇప్పుడు మీట నొక్కుతున్నారు కానీ.. ఒక రోజు ముందే అకౌంట్లలో ప్రధాని మోదీ నిధులు జమ చేశారని.. చెప్పేలా ఆ ట్వీట్ ఉంది. దాంతో అది వైరల్ అయింది. విజయసాయిరెడ్డి విషయంలో బయట జరుగుతున్న దాని కన్నా .. తీవ్రమైన వ్యవహారం ఏదో అంతర్గతంగా జరుగుతోందన్న అభిప్రాయం వైసీపీలో బలపడుతోంది.