వైసీపీకి తెలంగాణ పెద్ద చిక్కుముడిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో వైసీపీ లేదు. కానీ ఆ పార్టీకి కొంచెం ఓటు బ్యాంక్ ఉంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సమర్థించే కొంత మంది ఉంటారు. అలాంటి వారి మద్దతు ఇప్పుడు ఇతర పార్టీలకు కీలకమే . తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులను ఈ సారి బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ సంగతేమో కానీ ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందనే చర్చ ప్రారంభమయింది.
తెలంగాణలో టీఆర్ఎస్తో వైసీపీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఏపీ ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ మాట్లాడుకోని రెండు పార్టీల నేతలు రాజకీయ అవసరాల విషయంలో మాత్రం భాయి.. భాయి అనుకుంటూ ఉంటారు. అందులో సందేహం లేదు. అందుకే వైసీపీ ఎప్పుడూ టీఆర్ఎస్కు ఫేవర్‌గానే ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతున్న బీజేపీతోనూ తప్పనిసరిగా స్నేహం చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీతో వైసీపీ స్నేహం తప్పని సరి. అంటే తెలంగాణలో రెండు పార్టీలతోనూ వైసీపీకి సంబంధాలున్నాయి. ఆ రెండింటిలో ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది కీలకం.
తెర వెనుకైనా ఎవరికి మద్దతిచ్చినా మరొకరికి కోపం వస్తుంది. టీఆర్ఎస్కు కోపం వచ్చినా వైసీపీకి కష్టమే.. బీజేపీకి కోపం వచ్చినా కష్టమే. అలాగని ఎవరికీ మద్దతివ్వట్లేదని చెప్పలేని పరిస్థితి. పరోక్షంగా అయినా ఎవరో ఒకరి వైపు నిలబడాల్సిందే. లేకపోతే తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో వైసీపీకి ముందు ముందు చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.