కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన తర్వాత యడ్యూరప్పను గవర్నర్‌గా పంపాలని బీజేపీ హైకమాండ్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. కానీ యడ్యూరప్ప మాత్రం తాను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని పట్టుబడుతున్నారు. అలా రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం హైకమాండ్‌కు అంగీకారం అయితే అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాల్సిన అవసరం ఉండేది కాదు. అందుకే రాష్ట్రం నుంచి గవర్నర్ పదవి ఇచ్చి పంపేయాలని చూస్తున్నారు. కానీ గవర్నర్ పదవి వద్దని ఆయన ససేమిరా అంటున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఆయన కోసం తెలంగాణ గవర్నర్ పదవిని రెడీ చేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు గవర్నర్‌గా వెళ్లాలని ఆయనపై ఒత్తిడి పెంచుతున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణగవర్నర్గా తమిళిసై ఉన్నారు. ఆమె పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ అంటే చేయడానికి ఏమీ ఉండదు. కానీ పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అంటే..దాదాపుగా ముఖ్యమంత్రితో సమానం. కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఎక్కువ అధికారాలు ఉంటాయి. పైగా ఆమె స్వరాష్ట్రంలోనే ఉన్నట్లుగా ఉంటుంది. దీంతో తమిళిశై పుదుచ్చేరిలోనే కొనసాగడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. యడ్యూరప్ప లాంటి నేతకు పెద్ద రాష్ట్రానికే గవర్నర్‌ను చేయాలని.. తెలంగాణ అయితే సరిపోతుందని అంచనా వేస్తున్నారు.
యడ్యూరప్ప ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు ఆయనను తెలంగాణ గవర్నర్‌గా పంపిస్తారని కర్ణాటక రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన మాత్రం సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా చురుగ్గా తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారు. ఇది కూడా బీజేపీ పెద్దలను కలవర పెడుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొమ్మై ఆయన శిష్యుడే అయినప్పటికీ.. ఎక్కడైనా తేడా వస్తే అంతా రచ్చ అయిపోతుందని అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే… యడ్యూరప్పను గవర్నర్‌గా పంపడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు.