మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త మంత్రులను జగన్ సెలక్ట్ చేసుకుంటున్నారు. నెల్లూరు నుంచి దివంగత మంత్రి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తికి కేబినెట్లో చాన్స్ ఇచ్చి ఉపఎన్నికల్లో నిలబెడతారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమె పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో కంగారు పడిన మేకపాటి కుటుంబం… గౌతంరెడ్డి సోదరుడు విక్రం రెడ్డి పేరును సీఎం జగన్కు పంపింది. గౌతంరెడ్డికి బదులుగా ఆయన సోదరుడు విక్రం రెడ్డి రాజకీయాల్లోకి వస్తారని.. ఆయన పేరును పరిశీలించాలని కోరింది.
సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారాఈ విషయాన్ని జగన్కు చేర వేసినట్లుగా మేకపాటిక కుటుంబీకులు చెబుతున్నారు. ఈ విషయం జగన్కు చేరిందో లేదో కానీ మీడియాకు మాత్రం సమాచారం అందింది. విక్రంరెడ్డి ప్రస్తుతం మేకపాటి కన్స్ట్రక్షన్ కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నారు. గతంలో గౌతంరెడ్డి చూసుకునేవారు. ఆయన తర్వాత విక్రం రెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పుడు విక్రంరెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.
అయితే మేకపాటి కుటుంబానికి ఈ సారి మంత్రివర్గంలో బెర్త్ ఇవ్వడం అసాధ్యమని భావిస్తున్నారు. గౌతంరెడ్డి చనిపోయినందున ఆయన కుటుంబానికి అవకాశం ఇస్తారని చాలామంది భావస్తున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం ఆలాంటి ఆలోచనలో లేరని తెలుస్తోంది. ఉపఎన్నికల్లోనూ మేకపాటి రాజమోహన్ రెడ్డి మరో కుమారుడికి కాకుండా.. భార్యకే టిక్కెట్ ఇస్తామని తేల్చి చెప్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తంగా జగన్ తీరు వల్ల మేకపాటి కుటుంబంలో వివాదాలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం నెల్లూరు రాజకీయాల్లో నడుస్తోంది.