ఏపీ విభజనపై పార్లమెంట్లో మోడీ చేసిన వ్యాఖ్యలు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కలలో కూడా వెంటాడుతున్నట్లుగా ఉన్నాయి. ఆయన ఏపీకి అన్యాయం జరిగిందన్నఅంశంపై వరుసగా రెండో సారి ప్రెస్‌మీట్ పెట్టి కొన్ని విచిత్ర ప్రతిపాదనలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ అంశంలో స్పందించాలని ఏపీకి జరిగిన అన్యాయంపై కేసీఆర్ మాట్లాడాలన్నారు. బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలన్నారు. ఏపీ విభజన నిబంధనల ప్రకారం జరిగిందని కేసీఆర్ ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.
కారణం ఏదైనా విభజనను ప్రశ్నించేందుకు కేసీఆర్ వందకు వెయ్యి శాతం అంగీకరించరు. అసలు ఆ విషయంలో చర్చే అంగీకరించరు. ఆ విషయం ఉండవల్లికి తెలియనిదేం కాదు. విచిత్రంగా ఆయన విభజన నిబంధనల ప్రకారం జరిగిందని కేసీఆర్ ఒప్పుకుంటారా అని ప్రశ్నించి.. తనకు ఏదో అంతర్గత ఎజెండా ఉందని అనుమానపడేలా చేశారు. బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకుని పోయేందుకు కేసీఆర్ సిద్ధంగానే ఉన్నారు.. కానీ జగన్ వెళ్తారా అన్నదే ఇప్పుడు కీలకం. ఎందుకంటే మొదట్లో బీజేపీపై పోరాటానికి జగన్, కేసీఆర్ చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఒక్కరే ముందుకు వెళ్తున్నారు.
విభజనపై ఉండవల్లి 2013లోనే పిటిషన్ దాఖలు చేశారు. మళ్ళీ అర్జెంట్ హియరింగ్ పిటీషన్ దాఖలు చేసినట్లుగా ప్రకటించారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లి చేతులు జోడించి వేడుకున్నారు. ముఖ్యమంత్రి స్పందించి ఒక మెయిల్ ఏర్పాటు చేసి ఏపీ విభజనపై ప్రజల అభిప్రాయాలు సేకరించాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు, జగన్‌లు కొట్టుకొని ఏపీకి అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం జగన్ నోరుమెదపకపోవటం దుర్మార్గమంటున్నారు. విభజనపై ఉండవల్లి ఆవేదన ఏపీలోని ఎంపీలు ఎవరికీ పట్టడం లేదు.