వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఈ నెల 7, 8 తేదీల్లో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు భారీగా చేస్తున్నారు. ప్లీనరీలో ఈ సారి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి పాల్గొంటారా లేదా అన్న సందేహం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల్లోనే కాదు ఇతర రాజకీయ పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. దీనికి కారణం ఉంది. కొంత కాలంగా వైఎస్ విజయలక్ష్మి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు.
తెలంగాణలో కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభిండంతో ఆమె కుమార్తెకు సహాయంగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీక్షల్లోనూ కూర్చున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్స్‌లో మాత్రం కనిపించడం లేదు. అదే సమయంలో కుమారుడు సీఎం జగన్‌తో మాటల్లేవని ప్రచారం జరుగుతోంది. అసలు గౌరవాధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతానంటే.. ప్లీనరీ వరకూ ఆగాలని జగన్ బతిమాలినట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం సీఎం జగన్ పారిస్‌లో ఉన్నారు. కుమార్తె గ్రాడ్యూయేషన్ పూర్తయిన సందర్భంగా యూనివర్శిటీ నిర్వహిస్తున్న కాన్వొకేషన్లో పాల్గొనేందుకు వెళ్లారు. గత నెలలో షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలో ఇలా గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ కాన్వొకేషన్‌కు షర్మిలతో పాటు విజయమ్మ కూడా వెళ్లారు. ఇప్పుడు జగన్ కుమార్తె.. మనవరాలు అయిన హర్షారెడ్డి కాన్వొకేషన్‌కు విజయమ్మ వెళ్లారో లేదో స్పష్టత లేదు. వెళ్లలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎంతో ఇష్టమైన మనవరాలు డిగ్రీ పట్టా తీసుకునే కార్యక్రమానికే వెళ్లని విజయమ్మ.. ప్లీనరీకి వస్తారా అనేది ఎక్కువ మంది సందేహం.