ఏపీకి పూర్తి స్థాయి బడ్జెట్ లేదంటున్న జగన్ రెడ్డి .. ఆ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం తమ పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబర్ 11వ తేదీన ప్రవేశ పెట్టనుంది.. అదే రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ప్రభుత్వం జూన్ లో ఏర్పడినప్పటికీ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉండటంతో ఓటాన్ అకౌంట్ మీదుగానే నడిపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం లెక్కలు తేల్చుకుని బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
పథకాలకు డబ్బులు లేక బడ్జెట్ పెట్టడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ పథకాలను ఒకటి తర్వాత ఒకటి ఎలా అమలు చేయాలో చంద్రబాబుకు ఓ స్పష్టత ఉంది. ఇప్పటికే ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కీలకమైన పథకాలు. ఈ రెండింటికే నిధులు అవసరం అవుతాయి. ఇప్పటికే సమీకరణకు ఏర్పాట్లు చేశారు. వచ్చే రెండు, మూడు నెలల్లో చెల్లించబోతున్నారు. వాటికి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు.
పథకాల విషయంలో ప్రభుత్వం ఏర్పడిన రెండోవారం నుంచి అమలు చేయలేదని జగన్ గగ్గోలు పెడుతున్నారు. కానీ చంద్రబాబు జీవోలు రిలీఫ్ చేసి అదే అమలు అని జగన్ రెడ్డి స్టైల్ ను ఫాలో కావడం లేదు. ఖచ్చితంగా లబ్దిదారుల ఖాతాకు నగదు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది వైసీపీ నేతలకూ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో తాము అమలు చేసిన పథకాలు వాటికి బటన్లు నొక్కి వదిలేసిన వైనం అన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు అసలు అసెంబ్లీకి రాకపోవడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది.