ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రుల కలల సౌధంగా పేరు పడిన అమరావతిని పునాదుల్లోనే ఆపేశారు. కట్టిన భవనాలు.. రాజధానికి రైతులు ఇచ్చిన భూములు అమ్మేయడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. రేపో మాపో.. చలో వైజాగ్ అంటున్నారు. దీన్ని వైసీపీ ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారు. కానీ … ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే.. వీరంతా ఏం చెప్పారో కళ్ల ముందు కనిపిస్తోంది. గుర్తుకు వస్తుంది. ఔరా… ప్రజల్ని ఇంత దారుణంగా బకరాల్ని చేయవచ్చా అని ఆశ్చర్యపోవచ్చు కూడా.
అమరావతే అని ఓట్లు గుద్దేవరకూ వాదించారుగా..!?
వైసీపీ విధానం మూడు రాజధానులే అయితే..అది మేనిఫెస్టోలో పెట్టాల్సి ఉంది. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… అమరావతిని కట్టి తీరుతామని చెప్పింది. అవసరం అయితే మేనిఫెస్టోలో కూడా పెడతామని.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఊరూవాడా… వైసీపీ నేతలు.. అమరావతిని చంద్రబాబు కట్ట లేకపోయారని.. తాము కట్టి చూపిస్తామని చాలెంజ్‌లు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ అభ్యర్థులు… రాజధాని మార్చబోరని … జగన్ అలా చేస్తే తాము రాజీనామాలు చేస్తామని చాలెంజ్‌లు కూడా చేశారు. చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అమరావతిని సమర్థించారు. రాజధానిగా గుంటూరు, కృష్ణా ప్రాంతాలు సరిగ్గా ఉంటాయని…జాతీయ మీడియాకు కూడా చెప్పారు. ఐదేళ్ల కాలంలో ఆయన ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదు. అమరావతిని మార్చబోమని మాటలతో చెబితే ప్రజలు నమ్మరని అనుకున్నారేమో కానీ.. నేరుగా ఇల్లే కట్టించేసుకున్నారు. అమరావతిని మారుస్తారా.. అంటూ.. ఆయనకు వచ్చిన ప్రశ్నలకు.. తాను తాడేపల్లిలో కట్టుకున్న ఇంటినే సమాధానంగా చూపించారు. అదే సమయంలో.. చంద్రబాబుకే అమరావతిపై చిత్తశుద్ధి లేదని.. ఆయన అక్కడ ఇల్లు కట్టుకోలేదని ఎదురుదాడి కూడా చేశారు. అమరావతికే మద్దతనే సందేశాన్ని తన ద్వారా.. తన పార్టీ ద్వారా.. పార్టీ నేతల ద్వారా.. బలంగా ప్రజల్లోకి పంపించారు.
గెలవగానే… అమరావతిని చంపేస్తూ మద్దతుగా ప్రకటనలు చేస్తారా..?
మొత్తంగా… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ … ప్రజలు ఓట్లు వేసే వరకూ.. అమరావతికే కట్టుబడి ఉంది. ఒక్కసారిగా.. అధికారం అందిన తర్వాత అనూహ్యంగా విధానాన్ని మార్చుకుంది. అమరావతిపై.. కుల ముద్ర దగ్గర్నుంచి ముంపు వద్ద వరకూ అన్నీ వేశారు. స్మశానం అనే మాట దగ్గర్నుంచి అనాల్సివన్నీ అనేశారు. తిరుగులేని అధికారం.. ఎవరైనా ఎదురు తిరిగితే.. కేసులు పెట్టి అరెస్ట్ చేయడం.. కనీసం సోషల్ మీడియాలో కూడా.. ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయకుండా కట్టడి చేయడంతో… సామాన్యులు ఎవరూ… తమ అభిప్రాయాలు వ్యక్తం చేయలేకపోతున్నారు. అదే అదనుగా… అమరావతిని తరలించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమయింది. వైసీపీ ప్రభుత్వం చెప్పిన దానికి .. గెలిచిన తర్వాత చేస్తున్న దానికి అసలు పొంతన లేదు. ఇలాంటి సమయంలో.. సహజంగానే… ప్రజాభిప్రాయసేకరణ జరపాలనే డిమాండ్ వస్తుంది. ఇప్పుడు వస్తోంది కూడా. కానీ ప్రభుత్వం మాత్రం.. సైలెంట్‌గా ఉంటోంది.
ప్రజలు ఓ మాదిరిగా కూడా వైసీపీ నేతలకు కనిపించడం లేదా..?
అమరావతిలో ప్రజాధనం పది వేల కోట్లు ఉంది. రైతులు ఇచ్చిన 33వేల ఎకరాల భూమి ఉంది. మరిన్ని వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి నగరం కళ్ల ముందు కనిపిస్తూ ఉండేది.అలాంటి నగరాన్ని కోల్పోవాలని ఏ రాష్ట్రానికైనా ఉంటుందా… ఏ రాష్ట్ర ప్రజలకైనా ఉండదు. జగన్మోహన్ రెడ్డి… మొదట్లో.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు కూడా.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయిది. మూడు రాజధానులు అనే ఆలోచనే.. చాలా మందిని ఆశ్చర్య పరిచింది. వ్యాపారవేత్తలు… విద్యావేత్తలు.. జర్నలిజం ప్రముఖులు కూడా.. విస్మయం వ్యక్తం చేశారు. ముందు చెప్పిన దానికి.. గెలిచిన తర్వాత చేస్తున్న దానికి పొంతన లేదు. ప్రజల్ని బకరాల్ని చేయడం మాత్రమే చేస్తున్నారు.