ప్రధానమంత్రి ఎక్కడైనా పర్యటిస్తే .. అధికారిక కార్యక్రమాలు అయిపోయిన తరవాత పార్టీ తరపున బహిరంగసభ పెడతారు. కానీ ఏపీలో మాత్రం ప్రభుత్వం తరపునే పెడతారు. ఎంత ఖర్చు అయినా సరే భరిస్తారు. అంతే కాదు అధికార పార్టీ నేతలు భారీ జన సమీకరణ చేస్తామని ప్రకటిస్తున్నారు. మూడు లక్షల మందికిపైగా తరలిస్తామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ నేతలు కూడా .. వైసీపీపై మండి పడుతున్నారు. ఇదేం తీరని.. వస్తోంది బీజేపీ ప్రధాని కాబట్టి వైసీపీ సైలెంట్‌గా ఉండాలంటున్నారు.
అంతా యాక్టివ్ పార్టీ వైసీపీ తీసుకుంటూంటే.. తమ వైపు అనుమానంగా చూస్తున్నారని అనుకున్నారేమో కానీ. బీజేపీ నేతలు కూడా కొద్ది రోజులుగా రోజూ సమావేశం అవుతున్నారు. విశాఖ నేతలు సమావేశం అయి… మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం వారికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. తాము కూడా పట్టించుకుంటున్నామని చెప్పుకోవడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు..కానీ అక్కడ జరుగుతోంది మాత్రం.. పూర్తిగా వైసీపీ కనుసన్నల్లో.
జన సమీకరణ చేయాలనుకుంటున్న వైసీపీ.. డ్రాక్రా మహిళల్ని.. పథకాల లబ్దిదారుల్ని బెదిరించి తీసుకొస్తుందా లేకపోతే.. పార్టీ కార్యకర్తలను కూడా తేవాలని నాయకులకు టార్గెట్ పెడుతుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అలా ఎవరిని తీసుకొచ్చినా వారికి బీజేపీ జెండాలు చేతిలో పెట్టాల్సిందే. అంతే కానీ వైసీపీ జెండాలు పెట్టలేరు. అలా పెడితే మోదీకి కోపం వస్తుంది. బీజేపీకి పెద్ద ఎత్తున ఆదరణ ఉందని చూపించడానికి..వైసీపీ పడుతున్న తంటాలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. కేసులుంటే ఇన్ని కష్టాలుంటాయా అని ముక్కున వేలేసుకుంటున్నారు.