ఏపీ కేబినెట్ అయితే కళంకితులు.. లేకపోతే అసమర్థులు అన్నట్లుగా చీలిపోయింది. ఈ కేబినెట్ తోనే జగన్ ఎన్నికలకు వెళ్తారా అని వైసీపీ క్యాడరే నోళ్లు నొక్కుకుంటోంది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఎక్కువైపోయారు. మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు. తాజాగా ఆయన ఓ తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. తన బిడ్డ చనిపోతే వచ్చిన పరిహారంలో సగం లంచం అడిగారని ఆమె ఆరోపించారు. దానికి తగ్గట్లుగానే ఆమెకు నష్టపరిహారం చెక్ అందలేదు. దాంతో అందరిలోనూ అంబటి రాంబాబు కావాలనే అలా చేశారన్న నమ్మకం బలపడింది. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపింది. ఇక మరో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా అంతే. ఆయన రైతుల భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ భూముల్ని మార్కెట్ విలువకు మళ్లీ రైతులకే ఇచ్చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఈ వివాదం మాత్రం సద్దుమణిగే అవకాశం లేదు.
మరో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు విషయంలో కోర్టులో దొంగతనం జరిగింది. ఆ సాక్ష్యాలు దొంగతనం జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.ఈ కేసు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. చివరికి హైకోర్టు సీబీఐకి ఇచ్చింది. నైతిక బాధ్యతగా అయినా రాజీనామా చేయాలని అంటున్నారు. మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెవిన్యూ మంత్రిగా పని చేశారు. అప్పట్లో భూఅక్రమాలకు పాల్పడ్డారని.. సిట్ నివేదిక వెల్లడించింది . దీంతో ఆయన కూడా పదవిలో ఎలా కొనసాగుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మిగిలిన మంత్రుల్లో పలువురిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక మిగిలిన వారిలో చాలా మంది అసమర్థులుగా ముద్రపడిపోయారు. ఏం జరిగినా మంత్రి జోగి రమేష్ ఒకరే స్పందిస్తున్నారు. ఒకరిద్దరు మంత్రులు స్పందిస్తున్నప్పటికీ ఆ డోస్ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో సరిపోవడం లేదు. నిజానికి ఏపీ మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వారి పేర్లేమిటో చాలా మందికి గుర్తు ఉండదు. అసలు మంత్రుల పేర్లేమిటో కూడా జనానికి గుర్తు లేదని విపక్ష పార్టీలు సెటైర్లు వేస్తూంటాయి.
మూడు నెలల కిందట జరిగిన ఓ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్.. సహచర మంత్రులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షానికి కౌంటర్ ఇవ్వడంలో పూర్తి స్థాయిలో వెనుకబడ్డారని మండిపడ్డారు. అదే సమయంలో పని తీరు.. వివాదాలు ఉన్న మంత్రులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు, నలుగురు మంత్రుల్ని మార్చేస్తానని అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇంత జరిగిన తర్వాతైనా మారుస్తారో.. ఇదే టీంతో ఎన్నికలకు వెళ్తారో మరి !