వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ను తప్పు పడుతూ ఆమెను ఏడాది పాటు సభనుంచి సస్పెన్షన్ చేసిన వ్యవహారం ఇప్పుడు మరింత పెద్ద దుమారంగా మారుతోంది. ఈ వ్యవహారంలో ఒకవైపు రోజా హైకోర్టును ఆశ్రయించి, న్యాయం కోరుతూ ఉండగా, మరోవైపు శాసనసభలో సభ్యుల ప్రవర్తన గురించి ఏర్పాటుచేసిన బుద్ధప్రసాద్ కమిటీలో సభ్యుడైనా వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా భిన్న ఆలోచనలను కలిగిస్తున్నాయి. తాను వ్యక్తం చేసిన అభ్యంతరాలను అసలు కమిటీ చర్చకు పట్టించుకోనే లేదంటూ ఆయన చెబుతున్న మాటలు పరిగణనలోకి తీసుకోదగినవి. కమిటీ శాసనసభ స్పీకరుకు నివేదిక ఇచ్చే గడువు కూడా సమీపిస్తున్న తరుణంలో.. గడికోట అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే.. అది కచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది.
పార్టీలో అంతర్గత వర్గాలనుంచి కొన్ని ప్రైవేటు సంభాషణల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. రోజా వ్యవహార సరళి మీద ఆ పార్టీ ఎమ్మెల్యేల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. రోజా సస్పెన్షన్ వ్యవహారం అనేది అంత తీవ్రంగా రగడగా మారకుండా చప్పున చల్లారి పోవడానికి ప్రధానకారణాల్లో అది కూడా ఒకటి. రోజా తీరు నచ్చని ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే ఉన్నారు.
అయితే ప్రస్తుతం చర్చ రోజా గురించి కాదు. మండలి బుద్ధ ప్రసాద్ కమిటీ అనేది అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ కమిటీలో ఒక సభ్యుడిగా వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ వ్యక్తం చేసే అభిప్రాయాలను మాత్రం పట్టించుకోకపోతే ఎలాగ? మరో నాలుగురోజుల్లో కమిటీ చివరి సమావేశం కూడా పూర్తిచేసి నివేదిక ఇచ్చేస్తుంది. శ్రీకాంత్‌రెడ్డి ఆరోపణల ప్రకారం కమిటీ ప్రజాస్వామికంగా అందరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తున్నది. కమిటీకి బయటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తే.. నివేదిక వచ్చే దాకా ఆగకుండా.. తొందరపాటు ఆరోపణల కింద కొట్టి పారేయవచ్చు. కానీ, కమిటీలో భాగమైన శ్రీకాంత్ చెప్పడం వలన.. ముందే మేలుకోవాల్సి ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు సమైక్యంగా కదలాలి. తమ పార్టీ ఎమ్మెల్యే అయిన రోజా మీద చర్యకు సంబంధించిన వ్యవహారంగా దీన్ని చూడరాదు. మొత్తం సభలో సభ్యుల ప్రవర్తనకు సంబంధించి అధికార పార్టీ ఏకపక్ష నిబంధనలు విధించి హక్కుల్ని కాలరాయకుండా వారు మేలుకోవాలి. ముందే మేలుకోవడం మంచిది. అదే సమయంలో.. అభ్యంతరాలకు విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నందుకు, రోజాకు కూడా వారంతా అండగా నిలుస్తారో లేదో కూడా గమనించాలి. ఆమె తీరు వైరి పక్షంలోనే కాదు, స్వపక్షంలో కూడా శత్రువుల్ని తయారుచేసిందో లేదో దీన్ని బట్టి అర్థమవుతుంది.