వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆయనపై మహిళల విషయంలోనే ఆరోపణలు రావడం… వాటిని ఆయన ఖండించడంలోనూ తడబడటమే కాకుండా సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తూండటంతో వైసీపీ పెద్దల్లోనూ ఆలోచన ప్రారంభమయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ నేతలపై ఇలాంటి ఆరోపణలు వస్తే కుట్ర అని చెప్పి సర్ది చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు అధికార పార్టీగా ఉండి కూడా అదే వాదన వినిపిస్తే చులకన అయిపోతామన్న అభిప్రాయం వైసీపీలో ఉంది. సుకన్ అనే మహిళ విషయంలో అంబటి రాంబాబు ఎవరితో మాట్లాడారో క్లారిటీ లేదు కానీ… విషయం మాత్రం చాలా పకడ్బందీగా లీక్ చేశారు. ఆయనదే వాయిస్.. ఆయనదే ఫోన్ నెంబర్ అని చాలా స్పష్టంగా తెలిసే వీడియోలు కూడా రెడీ చేశారు. దీంతో అత్యంత పకడ్బందీగా ట్రాప్ చేశారని తేలిపోయింది.
ప్రజల్లోనూ విస్తృత చర్చ జరిగుతోంది. దీంతో అంబటి రాంబాబుపై ఏదో ఓ చర్య తీసుకోకపోతే… ప్రజల్లో పలుకుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే రాంబాబు విషయంలో సైలెంట్‌గా ఉండటం కన్నా ఏదో ఓ చర్య తీసుకోవాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ముందుగా ఆయనకు షోకాజ్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసిన తర్వాతనే అంబటి రాంబాబు కుట్రను చేధిస్తానని …ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పైకి వచ్చానని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. అయితే అంబటి రాంబాబును సొంత పార్టీ నేతలే కార్నర్ చేసినట్లుగా …అదీ కూడా వైసీపీలో ప్రాధాన్యం దక్కించుకునే సామాజికవర్గం నేతలే చేశారన్న గట్టి అభిప్రాయం ఉండటంతో అంబటి రాంబాబుకు ఇక పార్టీలో గడ్డు పరిస్థితి తప్పదంటున్నారు.
ఆయన మాత్రం పార్టీ పెద్దలు తనకు అండగా ఉంటారన్న నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ వివాదం ప్రారంభమైన తర్వాత పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్న కీలకమైన నేతలతో మాట్లాడేందుకు అంబటి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లుగా వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై సైలెంట్‌గా ఉండటమా.. లేకపోతే అంబటిపై చర్యలు తీసుకుని మహిళల విషయం పార్టీ నేతలైనా సరే హద్దు మీరితే సహించేది లేదని సందేశాలు పంపడమా అన్న ఆప్షన్ ప్రస్తుతం వైసీపీ పెద్దల ఎదుట ఉందని అంచనా వేస్తున్నారు.